Woman Sells Husband Kidney then elopes with lover | చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న ఒక వ్యక్తి తన భార్య ఒత్తిడి చేయడంతో తన శరీర భాగాన్ని అమ్ముకున్నాడు. వచ్చిన ఆ సొమ్ముతో తన కూతురి భవిష్యత్తు బాగు పడుతుందని భావించాడు. కానీ కుటుంబం కోసం అంత త్యాగం చేసిన ఆ వ్యక్తిని అతని భార్య మోసం చేసింది. గుట్టు చప్పుడు కాకుండా తన ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా సంక్రైల్ పట్టణంలో ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. ఒక మహిళ తన భర్త కిడ్నీ విక్రయించాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన భర్తపై ఒత్తిడి చేసింది. భార్య ఒత్తిడికి తట్టుకోలేక భర్త తన కిడ్నీని అమ్మాడు. వచ్చే డబ్బుతో అతను తన కాపురంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భావించాడు. కానీ అతనికి ఊహించని మోసం ఎదురైంది. అతని భార్య ద్రోహం చేసి ఇంటి నుంచి పారిపోయింది.
Also Read: భార్యాబాధితులు.. ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు హంతకుడయ్యాడు
కిడ్నీ ఎందుకు విక్రియించాల్సి వచ్చిందంటే..
కుటుంబం పోషణ కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో అతని భార్య ఉన్న ఒక్కాగానొక్క కూతురి భవిష్యత్తు కోసం, ఉన్నత చదువుల కోసం.. భారీగా డబ్బు అవసరమని భర్తకు చెప్పింది. దీని కోసం అతను చేసే ఉద్యోగ సంపాదన సరిపోదని.. బయట ఆస్పత్రులలో కిడ్నీ విక్రయిస్తే భారీగా చెల్లిస్తారని చెప్పింది. అయితే తన శరీర అంగం విక్రయించాలంటే ఎవరికైనా అయిష్టత ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇందుకోసం అతను అంగీకరించలేదు. కానీ ప్రతిరోజు భార్య అతనిపై ఇంట్లో ఒత్తిడి చేసేది. దీనిపై తరుచూ గొడవలు జరిగేవి.
ఉద్యోగ ఒత్తిడితో ఇంటికి వస్తే భార్య పోరు అతను సహించలేకపోయేవాడు. చివరికి కూతురి భవిష్యత్తు కోసం అంగీకరించాడు. అందుకోసం తన భార్య చెప్పినట్లు వివిధ ఆస్పత్రులలో కిడ్నీ కొనుగోలు చేసే దళారులు సంప్రదించారు. అలా ఒక దళారి కిడ్నీ విక్రయిస్తే రూ.10 లక్షలు ఇస్తానని చెప్పడంతో ఇతని భార్య ఆ డీల్ ఖరారు చేసుకుంది. అలా ఆ వ్యక్తి తన కిడ్నీ విక్రియించి రూ.10 లక్షలు సంపాదించాడు. ఆ డబ్బులన్నీ తన భార్య చేతికే ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత అనుకోకుండా అతని భార్య కనిపించకుండా పోయింది. ఇంట్లు దాచిన రూ.10 లక్షలు కూడా మాయమయ్యాయి.
తన భార్యకు ఏం జరిగిందోనని ఎంతో ఆందోళన చెంది.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళ మిస్సింగ్ కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మహిళ ఫేస్ బుక్ అకౌంట్, ఆమె ఫోన్ కాల్ హిస్టరీ ట్రాక్ చేస్తే.. ఆమె ఒక యువకుడితో తరుచూ ఫోన్లో మాట్లాడేదని తెలిసింది. దీంతో పోలీసులకు ఆ యువకుడిపై అనుమానం కలిగింది. అతను ఒక పెయింటర్. అతని ఫోన్ ట్రాక్ చేస్తే.. అతను బరాక్ పూర్ నగరంలో ఉన్నట్లు లొకేషన్ చూపించింది. పోలీసులు వెంటనే బరాక్ పూర్ చేరుకొని ఆ యువకుడిని పట్టుకోగా.. అతని ఇంట్లోనే కిడ్ని విక్రయించిన వ్యక్తి భార్య ఉన్నట్లు తెలిసింది. కానీ ఆమె తన భర్తను వదిలేసి తన ప్రియుడితో సహజీవనం చేస్తున్నానని పోలీసులకు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.
ఈ విషయం పోలీసులు కిడ్నీ విక్రయించిన వ్యక్తికి తెలియజేశారు. కానీ పోలీసులు చెప్పిన విషయాలను అతను నమ్మలేదు. తన భార్య తనను, తన కూతురిని కాదని ఎక్కడికీ వెళ్లదని చెప్పాడు. ఆ తరువాత తన కూతురితో, తన అత్త మామలతో (భార్య తల్లిదండ్రులు) కలిసి బరాక్ పూర్ వెళ్లాడు. తన భార్యను తిరిగి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. తన కూతురు కోసమైనా ఆలోచించాలని ఆమె భవిష్యత్తు కోసం దాచిన సొమ్ముని కాజేస్తే ఎలా చేసేదని ప్రాధేయపడ్డాడు. అతనితోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురిని మందలించారు.
అయితే వారి మాటలు విని ఆమె కరిగిపోలేదు. ఇంకా రెచ్చిపోయింది. తనను వదిలేసి అందరూ వెళ్లిపోవాలని డబ్బు ఏమీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. తనను ఇబ్బంది పెడితే గృహహింస కేసు పెడతానని.. త్వరలో విడాకుల కోసం కోర్టులో కేసు వేస్తానని చెప్పింది. ఆమె మాటలు విని అతను తెల్ల ముఖం వేశాడు. ఒక్క కిడ్నీతో శారిరకంగా బలహీనంగా ఉన్న అతను కూతురి కోసమే జీవితం అన్నట్లు జీవిస్తున్నాడు.