Abhishek Sharma: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ-20 లో భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వీర విహారం చేసిన విషయం తెలిసిందే. కేవలం 37 బంతులలోనే సెంచరీని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ చేయడానికి 17 బంతులు ఆడిన అభిషేక్ శర్మ.. సెంచరీ చేసేందుకు 20 బంతులు ఆడాడు. ఈ మ్యాచ్ లో 270 స్ట్రైక్ రేట్ తో 13 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో మొత్తంగా 135 పరుగులు చేశాడు.
Also Read: Yuvraj Singh: ఏంట్రా నువ్వు.. నా కన్న భయంకరంగా ఆడుతున్నావు
ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు, ఆర్చర్ ని టార్చర్ పెట్టాడు. మార్క్ వుడ్ వంటి సూపర్ ఫాస్ట్ బౌలర్ ని షేక్ చేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఇక స్పిన్నర్లను కూడా చీల్చి చెండాడాడు. అటు బౌలింగ్ లో కూడా రెండు వికెట్లను పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే తాజాగా తన ఇన్నింగ్స్ పై అభిషేక్ మాట్లాడుతూ.. తన మెంటార్ యువరాజ్ సింగ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ప్రత్యర్థి బౌలర్లు 140, 150 వేగంతో బౌలింగ్ చేస్తున్నప్పుడు తన వ్యూహం ఎలా ఉంటుందో తెలిపాడు అభిషేక్ శర్మ.
” నాదైన రోజున మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడి పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా. ఈ మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం. దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్పాను. నా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ నా నుంచి ఇదే కోరుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు హై స్పీడ్ వేగంతో బంతులు వేసినప్పుడు ఒక సెకను ముందే సిద్ధంగా ఉండాలని సూచించారు.
బంతిని ముందే అంచనా వేసి.. బంతికి తగినట్లుగానే స్పందించి షాట్లను ఆడా. ప్రపంచ స్థాయి బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో కవర్ షాట్ ఆడడం తేలికైన విషయం కాదు. ఆ షాట్ నాకెంతో ప్రత్యేకం. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో కొట్టిన సిక్స్ లు కూడా నాకు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా స్ట్రెయిట్ డ్రైవ్ బాగా గుర్తుండిపోతుంది. నా మెంటార్ యువరాజ్ సింగ్ కూడా ఈ ప్రత్యేక షాట్ గురించి నాతో మాట్లాడారు.
Also Read: Alastair Cook: నా జీవితంలో కొట్టినన్ని సిక్సులు…2 గంటల్లో అభిషేక్ శర్మ కొట్టేశాడు !
ఇప్పుడు నా ప్రదర్శన చూసి ఆయన చాలా సంతోషించి ఉంటారు. ఇది యువరాజ్ సింగ్ వల్లే సాధ్యమైంది. నేను ఎప్పుడూ 15 – 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని ఆయన కోరుకుంటారు. మా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నేను కనీసం 15 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండాలని కోరుకుంటారు. ఈ మ్యాచ్ లో దానిని నేను అమలు చేసి చూపించా. కాబట్టి ఈ రోజు.. నా రోజు అని నేను భావిస్తున్నాను”. అని వెల్లడించాడు అభిషేక్ శర్మ.