BigTV English

Trump Tariff War Impact : ప్రపంచంపై ట్రంప్‌ వాణిజ్య యుద్ధ ప్రభావం.. సుంకాలతో ధరల మోత

Trump Tariff War Impact : ప్రపంచంపై ట్రంప్‌ వాణిజ్య యుద్ధ ప్రభావం.. సుంకాలతో ధరల మోత

Trump Tariff War Impact | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య రంగంలో భారీ సుంకాలతో యుద్ధానికి తెరలేపారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచే ట్రంప్ ప్రపంచ దేశాలకు సుంకాలు పెంచుతానని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తరువాత ఆ స్వరం ఇంకా పెంచారు. చెప్పినట్లుగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనెడాలతోపాటు చైనాపై కూడా సుంకాల కొరడాను ఝుళిపించారు. మెక్సికో, కెనెడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం సుంకం, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ చర్యల వల్ల అమెరికాలోకి ఫెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలను అడ్డుకోవడమే తన లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. చైనా, మెక్సికో, కెనెడా దేశాలు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. ట్రంప్ చెప్పినంత పని చేయడంతో ఉలిక్కిపడిన కెనెడా, మెక్సికో ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నాయి.


కెనెడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికా ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తామని ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ కూడా వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని తెలిపారు. చైనా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. ట్రంప్ చర్య వల్ల అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్నది పక్కన పెడితే, ఈ వాణిజ్య యుద్ధం వల్ల ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు ఎదురవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, అమెరికన్ల జీవనం కష్టతరమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ప్రతీకార చర్యలకు దిగితే, ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది.

ఇంధన ఉత్పత్తులపై 10 శాతం సుంకం
ట్రంప్ తాజా సుంకాలు విధించేందుకు వీలుగా ముందు జాతీయ ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించారు. ఆ తర్వాత, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని కెనెడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై అసాధారణ సుంకాలు విధించారు. ఈ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. “అమెరికన్లను రక్షించడానికి ఈ సుంకాలు అవసరం. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకోవడానికి మెక్సికో, కెనెడా, చైనాలపై ఒత్తిడి పెంచడమే ఈ చర్యల లక్ష్యం” అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ అకౌంట్ లో పేర్కొన్నారు. కెనెడా నుంచి దిగుమతి అయ్యే సహజ వాయువు, చమురు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకం మాత్రమే విధించనున్నట్లు ట్రంప్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే, సుంకాలను మరింత పెంచేందుకు వీలుగా ఈ ఉత్తర్వులో ప్రత్యేక నిబంధనను చేర్చారు. ఈ చర్యల వల్ల అమెరికన్లు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. అయితే, అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టడానికి ఈ ఇబ్బందులను తట్టుకోక తప్పదని వ్యాఖ్యానించారు.


అమెరికన్లను ఉద్దేశించి ట్రూడో భావోద్వేగ ప్రసంగం, ప్రతీకార సుంకం
ట్రంప్ తాజా చర్యపై కెనెడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. అఫ్ఘానిస్తాన్లో అమెరికా సైన్యానికి మద్దతుగా కెనెడా సైన్యం కూడా పోరాడిన సంగతి గుర్తుచేశారు. అగ్నిపర్వతాలు బద్దలైన వేళ, హరికేన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమెరికాకు అండగా కెనెడా నిలిచిందని తెలిపారు. తాము చేసిన సాయానికి ఇదే ప్రతిఫలమా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై కెనెడా కూడా 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో 3 వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలినవాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి పలు ఉత్పత్తులు ఈ సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు.

Also Read: అమెరికాలో విలవిల్లాడుతున్న భారతీయ విద్యార్థులు.. ఫీజులు, ఖర్చులకు డబ్బుల్లేవ్

తలవంచేది లేదు: మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్
ట్రంప్ చర్యపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తోందని ట్రంప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. స్వదేశీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని ఆదేశించినట్లు తెలిపారు. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని నియంత్రించాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే, దేశీయంగా తగిన చర్యలు తీసుకోవాలే తప్ప, ఇతర దేశాలపై సుంకాలు విధించడం సరికాదని విమర్శించారు. మెక్సికో ఎప్పుడూ తలవంచబోదని స్పష్టం చేశారు. మరోవైపు, కెనెడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో ప్రభుత్వ దుకాణాల నుంచి అమెరికా ఆల్కహాల్ బ్రాండ్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

అమెరికన్లపై ధరల మోత
ట్రంప్ ఉత్తర్వుపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చర్యల వల్ల దేశంలో ఇంధన ధరలు పెరిగే ముప్పుందని అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ హెచ్చరించింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ట్రంప్ చర్యను విమర్శించింది. ఈ వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని యేల్ యూనివర్సిటీలోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. ఎన్నికల ప్రచారంలో నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇళ్ల ధరలు తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ ఈ వాణిజ్య యుద్ధం వల్ల ధరలు పెరిగే ముప్పు ఎదురవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుబట్టారు. అయితే, దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ చర్యల ద్వారా నిలబెట్టుకున్నట్లు ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. యురోప్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కంప్యూటర్ చిప్స్, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలపై కూడా సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు.

ట్రంప్ సుంకాలపై చైనా చర్యలు
ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. ఈ చర్యను ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సవాలు చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు మరియు హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో బెదిరించకుండా, ఫెంటానిల్ వంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా సలహా ఇచ్చింది.

భారతదేశంపై ప్రస్తుతానికి సుంకాలు లేవు
ట్రంప్ ఇంతకాలం సుంకాలు విధిస్తానని చెబుతూ వచ్చిన దేశాలలో భారత్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన ఇండియా నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై సుంకాలు పెంచలేదు. ఇటీవలే ఆయన బ్రిక్స్ దేశాలపై సుంకాలు, ఆంక్షలు విధించే అవకాశముందని కూడా చెప్పారు. బ్రిక్స్ దేశాలలో చైనా, భారత్, రష్యా, బ్రెబిల్ ప్రధానమైనవి. అయినప్పటికీ భారతదేశంపై చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం లేకపోలేదు. త్వరలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తరువాత ట్రంప్ కూడా భారత్ క విచ్చేయనున్నారు. బ్రిక్స్ దేశాలలో ట్రంప్ సుంకాల బెదిరింపులకు స్పందించిన ఒకే ఒక్క దేశం భారత్. అమెరికా డాలర్ కు వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ తీసుకొస్తే చర్యలు చేపడతానని ట్రంప్ బెదిరించడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అమెరికా డాలర్‌కు పోటీగా ఎటువంటి కరెన్సీని తీసుకొచ్చే యోచన తమకు లేదని.. ప్రపంచ వాణిజ్యానికి డాలర్ ఎంతో అవసరమని చెప్పి ట్రంప్ ఆవేశ ప్రభావం భారత్ పై రాకుండా నిలువరించారు.

ప్రపంచంపై సుంకాల ప్రభావం..
ట్రంప్ సుంకాల జాబితా మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది. అమెరికా సుంకాలు విధిస్తే ఇతర దేశాలు కూడా కెనెడా లాగే ప్రతీకార సుంకాలు విధిస్తాయి. అప్పుడు ఈ వాణిజ్య యుద్ధం వల్ల దిగుమతి వస్తువుల ధరల విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది.

Related News

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు

Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?

Big Stories

×