IPL : సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటలేకపోయింది. ముంబై చేతిలో ఓటమి చవిచూసింది. ఉత్కంఠగా సాగిన పోరులో రోహిత్ సేన 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ సాధించింది. కామెరూన్ గ్రీన్ (64, 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (38, 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), తిలక్ వర్మ ( 37, 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు ), రోహిత్ శర్మ ( 28, 18 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ , నటరాజన్ కు తలో వికెట్ దక్కింది.
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు రెండో ఓవర్ లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్ లో సెంచరీ హీరో హ్యారీ బ్రూక్ 9 పరుగులకే అవుటయ్యాడు. రాహుల్ త్రిపాఠి (7), కెప్టెన్ మార్ క్రమ్ (22) , అభిషేక్ శర్మ (1) అవుట్ కావడంతో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (48, 41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు), హెన్రిచ్ క్లాసెన్ (36, 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు ) 5వ వికెట్ కు 55 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు రేపారు. కానీ 5 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ అవుట్ కావడంతో మ్యాచ్ పై ముంబై పట్టుబిగించింది.
చివరి రెండు ఓవర్ల విజయానికి 24 పరుగులు చేయాల్సి ఉండగా.. 19 ఓవర్ గ్రీన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ లో హైదరాబాద్ కు 4 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ కు దిగడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. అయితే తన రెండో మ్యాచ్ లోనే ఎంతో పరిణితితో అర్జున్ బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ కెరీర్ లో తొలి వికెట్ తీసి హైదరాబాద్ ను ఆలౌట్ చేశాడు. భువనేశ్వర్ అవుట్ కావడంతో మరో బంతి మిగిలి ఉండగానే హైదరాబాద్ ఇన్నింగ్స్ 178 పరుగులకే ముగిసింది. తొలి మ్యాచ్ లో రెండు ఓవర్ల వేసి 17 పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్ లో మరింత మెరుగ్గా బౌలింగ్ చేశారు. 2.5 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై బౌలర్లలో అతి తక్కువ పరుగులు ఇచ్చింది అర్జున్ టెండూల్కరే..
ముంబై బౌలర్లలో బెరెన్ డార్ఫ్ , మెరిడియత్ , పియూష్ చావ్లా రెండేసి వికెట్లు తీశారు. గ్రీన్ , అర్జున్ టెండూల్కర్ కు తలో వికెట్ దక్కింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించిన గ్రీన్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిన ముంబై.. హైదరాబాద్ పై గెలుపుతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.