Big Stories

Jagan : శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. మూలపేట పోర్టుకు శంకుస్థాపన..

Jagan : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మిస్తారు. 30 నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్ల వ్యయం చేయనుంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడుతుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

- Advertisement -

మూలపేట పోర్టుకు ఎన్‌హెచ్‌ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ 4 లైన్ల రహదారి నిర్మిస్తారు. నౌపడ జంక్షన్‌ నుంచి పోర్టు వరకు 10.6 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం చేపడతారు. గొట్టా బ్యారేజ్‌ నుంచి 50 కి.మీ.పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి 0.5 ఎంఎల్‌డీ నీటిని పోర్టుకు సరఫరా చేస్తారు. పోర్టుకు అనుబంధంగా 5 వేల ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద , టెక్కలి నీలి గ్రానైట్‌ ఎగుమతికి, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్‌ కోల్, కోకింగ్‌ కోల్, ఎరువులు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడుతుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.

మరోవైపు విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 పోర్టు నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మిస్తోంది.

సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో నిర్మించే ఫిషింగ్‌ హార్బర్‌కు, హిర మండలం రిజర్వాయర్‌కు, వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News