
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ హీట్ క్షణక్షణానికి పెరిగిపోతోంది. ప్రజల్లో ఉత్సాహానికి తగినట్టుగా, వారి ఆలోచనలను మించినట్టుగా వినూత్నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచమంతా ఇండియా వైపు తలతిప్పి చూసేలా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.
ఇకపోతే మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. వీరందరికీ తగినట్టుగా భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను వేసింది. శనివారం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ప్రత్యేక రైలును నడపనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ముంబయి నుంచి కూడా ప్రత్యేక రైలు ను నడపనున్నారు. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ప్రజల డిమాండ్ ను బట్టి రైళ్లు సిద్ధమవుతున్నాయి.
అలాగే మ్యాచ్ రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. కార్యక్రమాలు, గానా భజానాలు, అవార్డులు, ట్రోఫీల అందజేత, క్రికెటర్ల అనుభవాలు, గెంతులు, కేరింతలు మీడియా చిట్ చాట్ లు ఇవన్నీ అయ్యేసరికి ఎలా లేదన్నా రాత్రి 12 గంటలు దాటుతుంది. అందువల్ల ఇవన్నీ పూర్తయి రైల్వే స్టేషన్ చేరుకునేలా మళ్లీ తిరుగు ప్రయాణం రైళ్లను రాత్రి 2.45 కి బయలుదేరేలా రైల్వే శాఖ ప్రణాళిక వేసింది. ఆ ప్రకారం రైళ్లను నడపనున్నారు.
రైల్వేశాఖలాగే అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రధాన ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతున్నాయి. కాకపోతే టిక్కెట్టు ధరలే ఆకాశానికి అంటుతున్నాయి. ఎంత ఖర్చయినా సరే, మ్యాచ్ చూడాల్సిందేనని అంటున్నారు.
సొంత కార్లపై బయలుదేరే వారికి లెక్కేలేదు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూసేందకు బయలుదేరుతున్నారు. అటు పుణ్యం, ఇటు పురుషార్థం రెండు లభిస్తాయని కొందరు రెట్టించిన ఉత్సాహంతో ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం అహ్మదాబాద్ సిద్ధమైపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లతో కలర్ ఫుల్ గా మారిపోయింది.
మళ్లీ జీవితంలో ఇలాంటి అవకాశం రాదని క్రికెట్ వీరాభిమానులు అంటున్నారు. క్రికెట్ ప్రేమికులైతే అప్పుడే ఆశల తీరంలో కప్ సాధించేసినట్టుగా విహరిస్తున్నారు. కలలు కంటున్నారు.