
Hyderabad latest news(Telangana today news):
హైదరాబాద్ లో మరోసారి మాదక ద్రవ్యాలు కలకలం రేపాయి. మాదాపూర్‌లో రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. డ్రగ్స్ సేవిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని మాదాపూర్ పోలీసులకు నార్కోటిక్ బ్యూరో అధికారులు అప్పగించారు.
బుధవారం అర్ధరాత్రి మాదాపూర్ విఠల్‌రావు నగర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. దీనిపై సమాచారం రావడంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి కొకైన్, LSD, గంజాయితోపాటు 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సినీ ఫైనాన్సియర్ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని పోలీసులు నిర్ధారించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీలు నిర్వహిస్తున్నారని గుర్తించారు.
వెంకట్ కు డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య సినిమాలకు వెంకట్ ఫైనాన్షియర్ గా ఉన్నారు. వెంకట్ కదలికలపై 3 నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. వెంకట్ వాట్సాప్ లో డ్రగ్స్ పార్టీపై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. మరో నిందితుడు బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నాయి.