MS Dhoni : 2006లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. నాడు ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో గెలుచుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేను చూసేందుకు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వచ్చాడు. ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 72 పరుగులు చేసిన ధోనీ.. చేజింగ్‌లో భారత్ జట్టును గెలిపించాడు.
ఆ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ధోనీ దూకుడుతో 47.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడినా సరే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందిస్తూ.. ధోనీని పదిమందిలో ముషారఫ్ అభినందించడమే కాదు, ధోనీ హెయిర్‌స్టైల్ కు ఫ్యాన్ అయిపోయినట్టు తెలిపాడు. ఎప్పుడు కూడా జుట్టు కట్ చేయించుకోవద్దని ధోనీని రిక్వెస్ట్ చేయడం కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది.
ఇదంతా ఎందుకంటే తాజాగా పాకిస్తాన్ నుంచి మహేంద్ర సింగ్ ధోనికి పిలుపు వచ్చింది. పైన చెప్పిన విషయానికి, ఈ పిలుపునకు మధ్య లింక్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ఏమీలేదు. కానీ ధోనిని పాక్ పిలిచిందనేసరికి అందరికీ ఇదే సంఘటన గుర్తొచ్చింది. బహుశా ఆ విషయంపైనే పిలిచి ఉంటారని, ఏదో సన్మానం ఉంటుందని అంతా అనుకున్నారు.
కానీ ఆ వచ్చిన ఆహ్వానం క్రికెట్ కి సంబంధించినదే కాదు. 2006లో ధోనీ పాకిస్తాన్ పర్యటించాడు. అదే ముషారఫ్ అభినందించిన రోజులన్నమాట. అప్పుడు పాక్ లో తిన్న భోజనం ఎంతో బాగుందని, పాకిస్తాన్ వెళ్లేవాళ్లు, తప్పకుండా భోజనం చేయమని తాజాగా ఒక వీడియోలో ధోనీ తెలిపాడు.
అది సామాజిక మాధ్యమాల్లో వీర లెవెల్లో వైరల్ అయిపోయింది. అసలు ధోనీ ఏ ఊరిలో భోజనం చేశాడు? ఎక్కడ చేశాడని నెట్టింట శోధనలు మొదలుపెట్టారు. ఇవన్నీ గమనించిన పాకిస్తాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫఖర్ ఆలం స్పందించాడు. పాక్ భోజనం బాగుందని మెచ్చుకున్న ధోనీ మాటలపై ఆనందం వ్యక్తం చేశాడు. క్రికెట్ కోసం కాకుండా, మళ్లీ ఒకసారి భోజనం చేసేందుకు పాకిస్తాన్ రావల్సిందిగా ఎక్స్ (ట్విటర్ ) లో ఆహ్వానించాడు.
ఎలాగూ ధోనీ హెయిర్ స్టైల్ చర్చకు వచ్చింది కాబట్టి.. అసలు తన కొత్త హెయిర్ స్టైల్ పై ధోనీ ఏమంటున్నాడో చూద్దాం. ఇంతకుముందు తల దువ్వుకోడానికి 5 నిమిషాలు పడితే, ఇప్పుడు గంట పడుతోందని ధోనీ నవ్వుతూ అన్నాడు. ఇంత చేసేది తన అభిమానుల కోసమేనని తెలిపాడు. అంటే నాటి ముషారఫ్ నుంచి నేటి అభిమానుల వరకు ధోనీ హెయిర్ స్టైల్ ఎంతమందిపై ప్రభావం చూపిందో.. చూశారు కదండీ.. ధోనీ జుత్తు వెనుక, తిన్న భోజనం వెనుక ఎంత కథ ఉందో..!