Dravid Biopic: బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర నడుస్తోంది. రాజకీయ నాయకులు, సైనికుల వీరగాథలు, సెలబ్రిటీల స్టోరీలు, క్రికెటర్ల జీవిత కథలు, స్పోర్ట్స్ జానర్ లో తీసే సినిమాలు ఇలా ఒకటి కాదు.. ఎవరు జీవితంలో కష్టపడి పైకి వచ్చినా, విజయాలు సాధించినా వారి కథలను సినిమాలుగా తీసేస్తున్నారు.
అలాంటి వాటిలో కొన్ని దంగల్, ధోనీ, మైదాన్, 83, మేరీ కోమ్, సచిన్, సూర్మా, ఘూమర్, చక్ దే, భాగ్ మిల్కా భాగ్ లాంటి ఎన్నో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. తెలుగులో అయితే కౌలస్య క్రష్ణమూర్తి క్రికెటర్ జీవిత కథ సినిమాగా వచ్చింది. ఇదంతా ఎందుకంటే త్వరలో యువరాజ్ సింగ్ బయోపిక్ సినిమాగా రానుంది.
ఈ నేపథ్యంలో సియట్ జీవిత సాఫల్యాన్ని అందుకున్న రాహుల్ ద్రవిడ్ ని ఒక విలేఖరి మీ బయోపిక్ ఎప్పుడు సినిమాగా వస్తుంది? ఒకవేళ తీస్తే, అందులో హీరో ఎవరైతే బాగుంటారని అనుకుంటున్నారు? అని అడిగాడు. దానికి ద్రావిడ్ నవ్వుతూ మరొకరు ఎందుకు? ఆ డబ్బులేదో ఇస్తే, నేనే హీరోగా చేస్తానని అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మొత్తానికి బయోపిక్ ల ఒరవడిలో ఏదొక రోజు రాహుల్ ద్రవిడ్ కథ కూడా వెండితెరపై కదలాడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే రాహుల్ ద్రవిడ్ కథే ఎందుకు? అంటే తను కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ వంశం వీరిది. అయితే తర్వాత వీరు కర్ణాటకలోని బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు.
Also Read: సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్
రాహుల్ ద్రవిడ్ తండ్రి శరద్ ద్రవిడ్ ఏం చేసేవారంటే జామ్ తయారుచేసి, ప్రిజర్వ్ చేసే కంపెనీలో పని చేసేవారు. అందుకే ద్రవిడ్ ని.. ది వాల్, మిస్టర్ డిపెండబుల్ అనే కాదు జామీ అనే పేరుతో కూడా పిలుస్తారు. తను 12వ ఏట నుంచి క్రికెట్ ఆడుతూ అంచలంచెలుగా ఎదిగాడు. క్రికెటర్ గా, కోచ్ గా తన పాత్ర అద్వితీయమైనది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి బాధను అధిగమించి, టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ది కీలకపాత్ర. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వెస్టిండీస్ వేదికగా 2007 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా ద్రవిడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కానీ అదే వేదికపై 17 ఏళ్ల తర్వాత కోచ్‌గా ద్రవిడ్ ప్రపంచకప్‌ను గెలవడం విశేషం.
ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలు.. ద్రవిడ్ కెరీర్ నిండా పుష్కలంగా ఉన్నాయి. వాటిని కరెక్టుగా పట్టుకోగలిగి, చక్కని కథగా మార్చగలిగితే అద్భుతమైన బయోపిక్ వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే నా బయోపిక్ లో నేనే హీరో అని ద్రవిడ్ అనడంతో నెట్టింట సరదా సరదా కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ద్రవిడ్ బయోపిక్ తీయడానికి ఎవరు ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే.