
Shahid Afridi : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పై సీనియర్ల విమర్శలు ఆగడం లేదు. ఒకరు ఆగితే ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు. మంట చల్లారిందనుకుంటే..ఎవరో ఒకరు పెట్రోలు పోస్తూనే ఉన్నారు. మొత్తానికి బాబర్ ఆజామ్ కెప్టెన్సీ తొలగిస్తేనే గానీ, పాకిస్తానీయుల ఆగ్రహం చల్లారేలా లేదు.
మొత్తానికి పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్, ఎటాకింగ్ ప్లేయర్, స్పిన్ బౌలర్, ఇంకా చెప్పాలంటే సుదీర్ఘకాలం పాకిస్తాన్ టీమ్ కి సేవలందించిన షాహిద్ ఆఫ్రిది గళం విప్పాడు. ఇన్నాళ్లూ కామ్ గా ఊరుకున్న ఆయన ఉన్నట్టుండి నోరు విప్పడంపై అసలేం జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
ఒకవేళ బాబార్ ఆజామ్ కి మరొక అవకాశం ఇద్దామని పాకిస్తాన్ బోర్డుగానీ ఆలోచిస్తుందేమో తెలీదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది నోరు విప్పడం సంచలనాత్మకమైంది. ఇంతకీ ఆయనేమన్నాడంటే… బాబర్ ఆజామ్ కి ఎన్నో అవకాశాలిచ్చాం. సుమారు నాలుగేళ్లు కెప్టెన్ గా ఉన్నాడు. ఇంకా ఎంత అనుభవం కావాలి? అని ప్రశ్నించాడు.
గ్రౌండ్ లో అవసరాలను బట్టి వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లాలి. ఆ పని సమర్థవంతంగా బాబర్ ఆజామ్ చేయలేదు. తను బ్యాటర్ గా విఫలమయ్యాడా? సఫలమయ్యాడా? అనేది చెప్పను. కానీ జట్టుని ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపైనే ఉంది. అది స్ఫూర్తిమంతంగా చేయలేకపోయాడని అన్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అంచనాల మేరకు రాణించలేకపోయిందని అన్నాడు. ‘నేను బాబర్ ఆజామ్‌కు బిగ్ ఫ్యాన్ అని చెప్పాడు. తన కెప్టెన్సీని విమర్శిస్తే అభిమానులు నన్ను ట్రోల్ చేస్తున్నారు. బాబర్ ఎప్పటికీ నాకు తమ్ముడేనని అన్నాడు. అయితే తనని టాప్ కెప్టెన్లలో ఒకడిగా చూడాలనుకున్నానని తెలిపాడు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్తాన్ ఆడిన 9 మ్యాచ్‌లకు నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. జట్టులోని ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు సైతం టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపాయి.
జట్టులోని విభేదాలను పరిష్కరించడంలో బాబర్ చొరవ చూపించలేకపోయాడని ఆఫ్రిది అన్నాడు. అలాగే మిగిలిన సభ్యులు బహుశా బాబర్ మాటను విని ఉండకపోవచ్చునని అన్నాడు. టీమ్ ఎప్పుడు కెప్టెన్ మాట వినదో అప్పుడు అతను ఫెయిల్ అయినట్టేనని అన్నాడు. లీడర్ అనే వాడు బలంగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. వరల్డ్ కప్ లో ఓటమితో బాబర్ కెప్టెన్సీ లోపాలు బయటికి వచ్చాయని తెలిపాడు.
బాబర్ కి బోర్డు చాలా అవకాశాలు ఇచ్చింది. అతనితో కెప్టెన్సీ ప్రయోగం ఇక కరెక్టు కాదు…అతనొక వేస్ట్ కెప్టెన్ అని చివరికి తేల్చేశాడు.