Masood vs Afridi: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలిటెస్టు.. ఏ ముహూర్తాన జరిగిందో కానీ, అప్పటి నుంచి పాక్ జట్టులో లుకలుకలు పెరిగిపోయాయి. ఆ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో పెద్ద గొడవలే జరిగాయని, ఒకరినొకరు బాగా తిట్టుకున్నారని చెబుతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ కి స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది మధ్య మాటా మాటా పెరిగిందని అంటున్నారు. చివరికి ఒకరినొకరు గట్టిగా కొట్టుకున్నారని తెలిసింది. అయితే గొడవ జరుగుతుంటే ఎవరూ చూస్తూ ఉండరు కదా.. అందుకే తగదునమ్మా.. అంటూ వికెట్ కీపర్ రిజ్వాన్ మధ్యలోకి వెళ్లి సర్ది చెప్పాలని చూశాడు. దీంతో తనకి నాలుగు పుంజీలు తగిలాయంట.
దీంతో వారిద్దరి మధ్యకి వెళ్లడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదని తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే టెస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కి వెళుతుండగానే పాక్ కెప్టెన్ మసూద్ ఆవేశంగా పాక్ కోచ్ జేసన్ గిలెస్పీ పై గట్టిగా అరిచిన సంగతి అందరూ చూశారు. బహుశా ఫస్ట్ ఇన్నింగ్స్ ని త్వరగా డిక్లేర్ చేయించడం, స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం లాంటి నిర్ణయాలు కొంప ముంచాయని, అందుకే కోచ్ పై సీరియస్ అయ్యాడని అనుకున్నారు.
Also Read: యూఎస్ ఓపెన్ 2024.. టాప్ సీడ్లకు షాక్.. ప్రపంచ నెంబర్ టు, త్రీ ఆటగాళ్లు ఔట్
ఈ ఘటన జరగడానికి ముందు మసూద్- ఆఫ్రిది కి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. అదో పెద్ద చర్చనీయాంశమైంది. అదేమిటంటే తొలిటెస్టు ఓటమి తర్వాత మైదానం నుంచి వస్తుండగా కెప్టెన్ షాన్ మసూద్ ఏం చేశాడంటే, సరదాగా ఆఫ్రిది భుజమ్మీద చేయి వేయగా దాన్నతను కోపంగా తీసేశాడు.
ఈ క్రమంలోనే తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో వారిద్దరి మధ్యా మాటామాటా పెరిగి ముష్టిఘాతాలు కురిపించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు షాహిన్ అఫ్రిదిని తుది జట్టు నుంచి తప్పించారు. బహుశా తన దురుసు ప్రవర్తన వల్లే ఇలా జరిగిందని అందరూ అనుకుంటున్నారు. లేదంటే స్టార్ పేసర్ ని తప్పించరు కదా అంటున్నారు.