𝐀𝐛𝐡𝐢𝐬𝐡𝐞𝐤 𝐒𝐡𝐚𝐫𝐦𝐚: ప్రపంచ నెంబర్ వన్ టి-20 బ్యాటర్ అభిషేక్ శర్మ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ {SMAT 2025} లో బెంగాల్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఆదివారం రోజు హైదరాబాద్ జింఖానా మైదానంలో ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో 32 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అభిషేక్ శర్మ.. రెండవ మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
Also Read: Chloe Tryon Engagement: ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్
శుక్రవారం రోజు హర్యానాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి విఫలమైన అభిషేక్ శర్మ.. ఆదివారం రోజు బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం సెంచరీ సాధించాడు. మొదటి నుండి మంచి దూకుడు కనబరిచిన శర్మ.. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. అయితే ఆఫ్ సెంచరీ చేసిన సమయంలో అతడి 51 పరుగుల్లో 50 పరుగులు బౌండరీలే కావడం విశేషం. 51 పరుగులు చేసిన సమయంలో ఐదు సిక్సులు, ఐదు ఫోర్లు కొట్టి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మహమ్మద్ షమీ బౌలింగ్ లోని ఒకే ఓవర్ లో ఒంటరిగా 23 పరుగులు చేశాడు.
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేసే సమయానికి 11 సిక్సులు, ఏడు ఫోర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ తో టి-20 లో తన 8వ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీ తో ఇదే సంఖ్యలో సెంచరీలు ఉన్న రోహిత్ శర్మను చేరుకున్నాడు అభిషేక్ శర్మ. టీమిండియా ఆటగాళ్లలో ఎక్కువ టీ-20 సెంచరీలు ఉన్న వారిలో విరాట్ కోహ్లీ {9} మాత్రమే ముందున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది అభిషేక్ 92 సిక్సులు బాడాడు. దీంతో ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లలో ఇదే అత్యధికం. అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఈ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ మొత్తం 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ద్వారా రాబోయే మ్యాచ్ లలో అతనిపై అంచనాలు మరింత పెరుగుతాయి. ఈ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ ఆట తీరు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఊర్రుతలూగించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ అభిషేక్ శర్మ {148}, ప్రభు సిమ్రాన్ సింగ్ {70}, అన్మోల్ ప్రీత్ సింగ్ {11}, రమణ్ దీప్ సింగ్ {39}, సాన్విర్ సింగ్ {22}, నమన్ ధీర్ {7}, నేహాల్ వధేరా {2} పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 310 పరుగులు చేసింది. ఈ టోర్నీ చరిత్రలో ఇదే సెకండ్ హైయెస్ట్ స్కోర్. ముఖ్యంగా అభిషేక్ శర్మ 284.62 స్ట్రైక్ రేటుతో 148 పరుగులు చేయడం గమనార్హం.
దీంతో టి-20 ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ రెండవ స్థానంలో నిలిచాడు. గత ఏడాది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 151 పరుగులు చేసిన తిలక్ వర్మ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ 1, చౌదరి 1, అకాష్ దీప్ 2, ప్రమాణిక్ 1 వికెట్ పడగొట్టారు. ఇక 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. బెంగాల్ బ్యాటర్ కరణ్ లాల్ కేవలం ఒకపరుగు మాత్రమే చేసి అభిషేక్ శర్మ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.