African : T20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా నాకౌట్ దశకు చేరకుండానే ఇంటిదారి పడుతుందని ఎవరూ ఊహించలేదు. పసికూన లాంటి జట్టుతో జాగ్రత్తగానే ఆడి… సఫారీలు సెమీస్ చేరతారనే ధీమాతోనే… అభిమానులంతా ఉన్నారు. కానీ… నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడి ప్రొటీస్ కు షాకిచ్చింది.
నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ కు ముందే సౌతాఫ్రికా ఓటమి ఖరారైపోయింది. కానీ… బ్యాటర్లు అద్భుతం చేస్తారేమోనని ఎదురుచూశారు… సౌతాఫ్రికా ఆటగాళ్లు. కానీ… అద్భుతం నెదర్లాండ్స్ చేసిందే తప్ప… సౌతాఫ్రికా బ్యాటర్లు చేయలేకపోయారు. 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోగానే… సౌతాఫ్రికా ఆటగాళ్లకు కన్నీళ్లు ఆగలేదు. డేవిడ్ మిల్లర్ కన్నీళ్లు బయటికి కనిపించకుండా… కళ్ల మీట టవల్ వేసుకుని… తల వెనక్కు వాల్చి కనిపించాడు. ఇక కెప్టెన్ బవుమా… దుమికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక… తల దించుకుని రోదించాడు. కాసేపటి తర్వాత తేరుకున్న ఆ ఇద్దరి కళ్లల్లోకి చూసిన వారికి… నీటి పొరలు స్పష్టంగా కనిపించాయి.
నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైన కెప్టెన్ బవుమా… మెగా టోర్నీలో ఎంతో గొప్పగా ఆడినా… సెమీస్ చేరలేకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడ్డామని… విజయం ఖాయం అనుకున్న మ్యాచ్ లో ఓటమిని జట్టు సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదనగా చెప్పాడు. పాక్‌తో మ్యాచ్‌లో లాగే… నెదర్లాండ్స్ పైనా కీలక సమయంలో వికెట్లు పోగొట్టుకున్నామని… అందువల్లే ఓడిపోవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.