Southafirca Beats Bangladesh : T-20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా తొలి విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై బంపర్ విక్టరీ కొట్టింది. ఏకంగా 104 పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ మొత్తం బ్యాటర్లు కలిసి… సౌతాఫ్రికా బ్యాటర్ రోసో చేసినన్ని రన్స్ కూడా చేయలేకపోయారు. జింబాబ్వేతో మ్యాచ్ వర్షార్పణం కావడంతో… బంగ్లాపై కసికొద్దీ ఆడి ఘన విజయం సాధించారు… ప్రొటీస్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా… తొలి ఓవర్లోనే కెప్టెన్ బవుమా వికెట్ కోల్పోయింది. కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న బవుమా… ఈ మ్యాచ్ లోనూ 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రిలీ రోసో, డికాక్… ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. రెండో వికెట్ కు ఏకంగా 168 పరుగులు జోడించారు. ముఖ్యంగా రోసో, బంగ్లా బౌలర్లందరికీ చితగ్గొడుతూ… సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 56 బంతుల్లోనే 109 రన్స్ చేశాడు. 8 సిక్సర్లు, 7 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు… రోసో. డికాక్ కూడా 38 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 63 రన్స్ చేశాడు. వీళ్లిద్దరి విజృంభణతో… 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది… సౌతాఫ్రికా.
206 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్… ఆపసోపాలు పడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టులో లిట్టన్ దాస్ ఒక్కడే ఫరవాలేదని అనిపించేలా ఆడాడు. మిగతా బ్యాటర్లు మొత్తం చేతులెత్తేయడంతో… 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది… బంగ్లాదేశ్. ఆ టీమ్ బ్యాటర్లలో ఇద్దరు డకౌట్ కాగా… ఐదుగురు బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. బంగ్లా టీమ్ మొత్తం కలిసి… సౌతాఫ్రికా బ్యాటర్ రోసో చేసినన్ని పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన రోసోకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.