T20 World Cup 2024: ఎట్టకేలకు అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీ 20 ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేసింది. అయితే ఈసారి, సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా ఉండేలా జట్టును ఎంపిక చేశారు. ఎన్నాళ్లగానో సంజూశాంసన్ కు అవకాశాలు ఇవ్వకుండా, అతని కెరీర్ తో ఆటలాడిన బీసీసీఐ ఈసారి ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా జట్టుని ముందుండి నడపడమే కాదు 161 స్ట్రయిక్ రేట్ తో 385 పరుగులు చేశాడు.
మొన్నటి వరకు రింకూ సింగ్ ను అదీ ఇదని అన్నారు. కానీ ఐపీఎల్ మ్యాచ్ ల్లో చివర్లో రావడంతో ఇంపాక్ట్ చూపించలేక పోయాడు. 9 మ్యాచ్ ల్లో 123 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తనకి ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు. కానీ శివమ్ దుబె రూపంలో అతనికి చెక్ పడింది. అయితేనేం ఎక్స్ ట్రా ప్లేయర్ల రూపంలో జట్టులోనే ఉండటం కూసింత ఊరట అని చెప్పాలి.
కేఎల్ రాహుల్ ని పక్కన పెట్టడం నిజంగా విచారించదగ్గ విషయమే. ఎన్నోసార్లు టాప్ ఆర్డర్ విఫలమైతే, తను ముందుండి నడిపించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ధోనీ తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సరైనవాడు లేక చాలా ఇబ్బందులు పడితే, రాహుల్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు సంజూ శాంసన్ రూపంలో అతనికి చెక్ పడింది.
అన్నింటికన్నా మంచి రిషబ్ పంత్ మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపిక కావడం నిజంగా అందరికీ స్ఫూర్తి నిచ్చేదే. మృత్యు ముఖం వరకు వెళ్లి బయటకు వచ్చి, మళ్లీ క్రికెట్ ఆడి, టీ 20 ప్రపంచకప్ నకు ఎంపిక కావడం అంటే అంత ఈజీ కాదు. దానికెంతో పట్టుదల ఉండాలి. యువత అంతా కూడా రిషబ్ పంత్ ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
సీనియర్లుగా ఉన్న కొహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరిపైనా ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే విదేశాల్లోని స్లో పిచ్ లపై వీరి అనుభవం జట్టుకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నిజానికి 2022లో జరిగిన టీ ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఓటమితో అందరికీ అర్థమైంది ఏమిటంటే, వీళ్లిద్దరూ జట్టుకి భారంగా మారారని అనుకున్నారు. కానీ మళ్లీ వీళ్లు పుంజుకుని కుర్రాళ్లతో సమానంగా ఆడటంతో ఈసారి ప్రపంచకప్ జట్టుకి ఎంపికయ్యారు.
టీమ్ ఇండియా భావి కెప్టెన్ గా పేరుపొందిన హార్దిక్ పాండ్యా పేలవమైన ఆటతీరుతో అడుగులు వేస్తున్నాడు. దీంతో గతానుభవాన్ని పరిగణలోకి తీసుకుని సెలక్షన్ కమిటీ పాండ్యాకు అవకాశం ఇచ్చింది. దీంతో చచ్చి బతికినట్టయ్యింది.
Also Read: టీ20 ప్రపంచ కప్.. భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. అయినా సరే, తన ఆటతీరుపై అపారమైన నమ్మకంతో సెలక్షన్ కమిటీ ఓటు వేసింది. బహుశా రవీంద్ర జడేజాకి ఇదే ఆఖరి టీ 20 వరల్డ్ కప్ కావచ్చునని అంటున్నారు. తను కూడా అన్ని ఫార్మాట్లలో ఆడుతూ అలసిపోయాడు. బీసీసీఐ కన్నా ముందే తనే ఒకొక్క ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
ఈ సీజన్ లో ఫామ్ లో లేని పేసర్లు సిరాజ్, అర్షదీప్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే. అలాగే బుమ్రాకు వీరిచ్చే సపోర్ట్ పైనే మ్యాచ్ తీరు ఆధారపడి ఉంటుంది. మొత్తానికి పాత కొత్త మేలు కలయికతో టీ 20 ప్రపంచకప్ జట్టు సిద్ధమైంది. మరి మనయోధులు వెళ్లి ఎలా ఆడి వస్తారో వేచి చూడాల్సిందే.