Tanmay Agarwal : దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజీ ట్రోఫీలో రికార్డులు బద్దలవుతున్నాయి. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అంతేకాదు కళ్లు చెదిరే ఆటతో యువతరం మెరుపులు మెరిపిస్తోంది . ముఖ్యంగా హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీలో తన జోరు చూపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 నాటౌట్) ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. గతంలో సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ అక్కడ దేశవాళీ క్రికెట్‌లో 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. ఆ రికార్డ్ తన్మయ్ ధాటికి బద్దలైపోయింది.
ఈ రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులను కూడా తన్మయ్ అగర్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. డబుల్ సెంచరీని కూడా అత్యంత వేగంగా 119 బాల్స్ లోనే చేశాడు. అది గతంలో రవిశాస్త్రి పేరు మీద ఉంది. దానిని ఇప్పుడు అధిగమించాడు.
ఈ మ్యాచ్ లో తన్మయ్ ఒక్కడే కాదు అతనకి తోడుగా రాహుల్ సింగ్ కూడా సెంచరీ చేశాడు. తను కూడా 105 బాల్స్ లో 185 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ 48 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 529 పరుగులు చేసింది.
48 ఓవర్లలోనే ఇన్ని పరుగులు రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీలు నాణ్యతారహితంగా మారాయని అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో బౌలర్లు ఎంత ఘోరంగా వేస్తే, వీళ్లిద్దరూ ఇలా ఆడి ఉంటారని అంటున్నారు.
ప్రతీ జట్టులో కూడా నాణ్యమైన క్రికెటర్లు ఉన్నప్పుడే ఆట పోటాపోటీగా ఉంటుందని అంటున్నారు. దేశవాళి క్రికెట్ అంటే అర్థం లేకుండా పోయిందని కూడా అంటున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ నుంచి చామా మిలింద్, కార్తీకేయ మూడేసి వికెట్లు తీశారు.. తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు పడగొట్టాడు. పాలకోడేటీ సాయిరామ్, ఎల్లిగరమ్ సాంకేత్త తలా ఒక వికెట్ తీశారు.
రంజీ ట్రోఫీ లో హైదరాబాద్ జోరు మీద ఉంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. నాలుగోది ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో కూడా విజయం ఖాయంగానే ఉంది.