IND VS PAK: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు భారత్ తో పాకిస్తాన్ తలపడబోతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధుల మధ్య ఆసక్తికర పోరు నేడు దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం టీమ ఇండియాతో జరిగే మ్యాచ్ పాకిస్తాన్ కి కీలకంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమిపాలైతే.. ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే.
అందుకే ఈ మ్యాచ్ ని పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మ్యాచ్ లో పై చేయి సాధించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు {పీసీబీ} కొత్త వ్యూహాలు అనుసరిస్తోంది. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు స్పెషల్ కోచ్ నీ బరిలోకి దింపింది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి తాత్కాలిక హెడ్ కోచ్ గా ఉన్న సెలెక్టర్ అకీబ్ జావేద్.. తనకు సహాయం అందించేందుకు మరో వ్యక్తిని నియమించుకున్నాడు. మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్ ని తాత్కాలిక స్పెషల్ కోచ్ గా నియమించుకున్నాడు.
అకీబ్ విజ్ఞప్తి మేరకు మొదటిసారి శుక్రవారం నుండే పాకిస్తాన్ జట్టుతో కలిసి.. ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొని జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చాడు. ఇతడు మాజీ ఆల్రౌండర్. 1970 లలో దాయాది జట్టులో మంచి ప్లేయర్. ముధస్సర్ పాకిస్తాన్ జట్టు తరఫున 76 టెస్టులు, 122 వన్డేలు ఆడాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కి రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత కోచ్ గా అవతారం ఎత్తాడు. 1993 – 2001 మధ్య పలుమార్లు పాకిస్తాన్ జట్టుకి కోచ్ గా పని చేశాడు.
అలాగే కెన్యా, యూఏఈ టీమ్ లకు కోచ్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం ముదస్సర్ దుబాయ్ లో ఉంటూ ఐసీసీ గ్లోబల్ అకాడమీ లో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అఖీబ్ జావిద్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేడు జరగబోయే మ్యాచ్ తో టీమ్ ఇండియాకు సర్ప్రైజ్ ఇస్తామని అన్నాడు. ఈ సర్ప్రైజ్ కి భారత్ షాక్ అవుతుందని వ్యాఖ్యానించాడు. దీంతో పాకిస్తాన్ కోచ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓ అభిమాని చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. భారత్ కి సర్ప్రైజ్ ఇస్తామంటే.. “ఒకవేళ స్టేడియంలో బాంబులు వేస్తారా ఏంటి..?” అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అలాగే టీమ్ ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై అకీబ్ జావేద్ స్పందిస్తూ.. భారత్ స్పిన్ దాడి గురించి తమ జట్టు ఎలాంటి ఆందోళన చెందడం లేదన్నాడు. తమ బలానికి తగ్గట్టుగా ఆడతామని.. మాకు ముగ్గురు స్పెషల్ పేసర్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో తమ జట్టులో ఎటువంటి పెద్ద మార్పులు కనిపించని వెల్లడించాడు.
Oreyyy 🤣🤣🤣 pic.twitter.com/kuazA8iDIC
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 22, 2025