Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గుజరాత్ బౌలర్ల పై పగబట్టినట్టు ఊచకోత కోసేశాడు. వైభవ్ సూర్యవంశీ చాలా తేలికగా సిక్స్ బాదేయవచ్చా.. సెంచరీ చేయడం అంత సులువా..? అన్నట్టుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోలేదు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియాన్ని సునామిలా చుట్టేశాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇతని పవర్, టైమింగ్ చాలా అద్భుతమనే చెప్పాలి. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇక 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
Also Read : Vaibhav Suryavanshi : మటన్, పిజ్జా విపరీతంగా తింటాడా… అందుకే సెంచరీ బాదేశాడా..వైభవ్ హెల్త్ డైట్ ఇదే
ఈ కుర్రోడు 35 బంతుల్లోనే సెంచరీ చేయడం చేసి రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉత్సాహంతో ఊతకర్రలను కూడా మరిచిపోయాడు. గాయపడిన ద్రవిడ్ ఎలాంటి సపోర్టు లేకుండా నిలబడి యువకుడిని ఉత్సాహంగా ఉత్సాహపరిచాడు. భారత్ కి చెందిన మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అప్గానిస్తాన్ కి చెందిన రషీద్ ఖాన్.. కరీం జనత్ లతో సహా అంతర్జాతీయ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 11 సిక్స్ లు, 7 ఫోర్లు బాదాడు. ఇక మ్యాచ్ ముగిసిన తరువాత వైభవ్ సూర్యవంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బౌలర్ పేరు ఎక్కువగా చూడనని.. బంతిని మాత్రమే చూస్తాను. బంతిని చూసే ఆడతానని చెప్పుకొచ్చాడు.
“ఇది నా మొదటి 100 అని.. ఇది చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నేను గత మూడు, నాలుగు నెలలుగా ఐపీఎల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో సెంచడరీ చేయడం నా డ్రీమ్. నేను చాలా రోజులుగా కష్టపడి పని చేశాను. దాని ఫలితాలు గ్రౌండ్ లో కనిపించాయి” అని వెల్లడించాడు సూర్యవంశీ. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో కలిసి 12 ఓవర్లలోనే 166 పరుగులు చేశారు. సూర్యవంశీ ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు. సూర్యవంశీ బ్యాటింగ్ గురించి పలువురు కామెంట్స్ చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించడం విశేషం.
ఇక ఈ రికార్డు ఇప్పటివరకు రియాన్ పరాగ్ 17 ఏళ్లు, సంజూ శాంసన్ 18 ఏళ్లు, పృథ్వీషా 18 ఏళ్ల వద్ద ఉండేది. ఇక అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భాతర ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో చేసిన రికార్డును వైభవ్ 35 బంతుల్లో చేసాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ తరువాత.. ఇది రెండో అత్యంత వేగవంతమైన శతకం. వైభవ్ ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతూ రూ.1.1 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. అండర్ -19 జట్టులో అద్భుతంగా రాణించడంతోనే ఐపీఎల్ లోకి తీసుకున్నారు. ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టడంతో అతని ఆటతీరు చెప్పకనే చెప్పాడు వైభవ్. మూడో మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. ఇక రాబోయే రోజుల్లో టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.