
Virat Kohli : వన్డే వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీలో కింగ్ కోహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. దీంతో మిగిలి ఉన్న రెండు నాకౌట్ మ్యాచ్ ల్లో కోహ్లీ ఎలా ఆడతాడేనే దానిపై సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి కోహ్లీ మూడు వరల్డ్ కప్ లు ఆడాడు. అన్నింటా ఇండియా సెమీస్ వరకు వెళ్లింది. ముందు దంచి కొట్టి, నాకౌట్ దగ్గర కొహ్లీ తడబడుతున్నాడు. ఇది అందరికీ ఆందోళనగా ఉంది.
మూడు ప్రపంచకప్ సెమీస్ ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేశాడు. అన్నీ సింగిల్ డిజిట్లే చేసి అవుట్ అయ్యాడు. 2011లో పాకిస్తాన్‌తో సెమీస్ జరిగింది. ఆ మ్యాచులో కేవలం 9 పరుగులే చేసిన కోహ్లీ.. వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే అక్కడ ధోనీ నాయకత్వంలో మ్యాచ్ గెలిచాం. తర్వాత వరల్డ్ కప్ గెలిచాం. కానీ కోహ్లీ వరకు పెర్ ఫార్మెన్స్ చూస్తే అలా ఉంది.
ఇక 2015లో ఆసీస్‌తో సెమీఫైనల్ జరిగింది. ఆ మ్యాచులో 13 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం ఒక్క పరుగే చేసి వెనుతిరిగాడు. చివరగా 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో కూడా ఒక్క పరుగు వద్దనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 2 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. అంతేకాదు టోర్నీ టాప్ స్కోరర్‌గా కూడా ఉన్నాడు. అందువల్ల తన సెమీస్ జాడ్యాన్ని వదిలించుకుంటాడని అందరూ అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కివీస్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ ఎలా ఆడతాడనే దానిపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ మూడుసార్లు కూడా ఎడం చేతి వాటం పేసర్ల బౌలింగ్‌లోనే కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా ఎడం చేతి వాటం బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌నే కోహ్లీ ఎదుర్కోవాల్సి ఉంది.
ఇప్పుడు భారత జట్టుకి కోహ్లీయే ఇరుసుగా ఉన్నాడు. తను చక్రం సరిగ్గా తిప్పకపోతే జట్టుకి చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే రోహిత్ అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్నా.. మిడిలార్డర్‌లో కోహ్లీ చుట్టూనే భారత బ్యాటింగ్ తిరుగుతోంది. అందువల్ల సెమీస్ ఫోబియాని కోహ్లీ అధిగమించాలని అశేష భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.