
Telangana Manifestos : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రీసెంట్ గా బీజేపీ, కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైన తర్వాత ఎవరేం హామీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ప్రజలు కూడా ఎవరికి ఓటేస్తే.. ఏం వస్తుందని చర్చించుకుంటున్నారు. అన్ని మ్యానిఫెస్టోలు పరిశీలిస్తే మహిళా ఓటు బ్యాంక్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ అర్హులైన వారికి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించగా.. కాంగ్రెస్ ప్రతీ ఇంటికి 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పింది. అయితే.. బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిపై కాంగ్రెస్, బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దీంతో.. ఈ ఎన్నికల్లో భూమి చుట్టూ పెద్ద రాజీకీయమే జరుగుతోంది. దీంతో.. అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. భూమాత పోర్టల్ ద్వారా భూ హక్కులు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణి స్థానంలో మీ భూమి అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అందిరి భూమికి సెక్యూరిటీ కల్పిస్తామని బీజేపీ తెలిపింది.
కొంతకాలంగా దేశవ్యాప్తంగా బీసీల కేంద్రంగా రాజకీయం జరుగుతోంది. ఇది తెలంగాణలో కూడా మినహాయింపు కాదు. అందుకే బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. బీసీల కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక బీజేపీ అయితే.. బీసీ నేతనే సీఎంని చేస్తామని తెలిపింది.
ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇవ్వగా.. అధికారంలోకి వస్తే.. ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడంతో పాటు మోకాలు సర్జరీకి కూడా ఈ పథకం వర్తింప చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ తెలపగా.. ప్రతీ జిల్లాల్లో రెసిడిన్సియల్స్ స్కూళ్ల ఏర్పాటు చేస్తామని.. మరో4 ట్రిపుల్ ఐటీల కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటుతో పాటు.. అన్ని ప్రైవేటు స్కూలు ఫీజులపై పర్యవేక్షణ జరుపుతామని బీజేపీ హామీ ఇచ్చింది.
అర్హులైన మహిళలకు నెలకు 3 వేల రూపాయల భృతి ఇస్తామని అధికార బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ.. ప్రతీ మహిళకు మహాలక్ష్మీ పథకం ద్వారా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తమని.. మహిళల కోసం 10 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టిస్తామని బీజేపీ ప్రకటించింది.