Robin Uthappa : మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం విధితమే. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప తో పాటు నటుడు సోనూ సూద్ కి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. వచ్చే సోమవారం అనగా ఈనెల 22న రాబిన్ ఉతప్ప., ఈనెల 23న మంగళవారం యువరాజ్ సింగ్, 24న బుధవారం సోనూసూద్ విచారణకు హాజరు కావాలని నోటిసుల్లో సూచించింది. అక్రమ బెట్టింగ్ యాప్ లావాదేవీల్లో మనీలాండరింగ్ కి సంబంధించి ఈడీ ప్రశ్నించనుంది. ఇటీవలే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ లను ప్రశ్నించింది ఈడీ. మరోవైపు ఈ నెల 14న సినీ నటి ఊర్వశీ రౌతేలా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మిమి చక్రవర్తి ఈనెల 15న, ఊర్వశి రౌతేలా ఇవాళ ఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
వీరిపై మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘనతో పాటు అక్రమ బెట్టింగ్ యాప్ ప్రచారంలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరికి సమన్లు జారీ చేసింది. ఇక 1xBet తో పాటు పలు బెట్టింగ్ యాప్ లను వినియోగదారులు, పెట్టుబడిదారులను మోసం చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈడీ మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కోణంలో పెద్ద ఎత్తున దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇలా చిక్కుల్లో క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఉతప్ప చేరారు. అక్రమ బెట్టింగ్ యాప్ కేసు విచారణకు సంబంధించి టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్పలకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్ ఫామ్ 1xBetతో ముడిపడి ఉన్న కేసుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్స్ కింద యువరాజ్ సింగ్, ఉతప్ప ఇద్దరూ తమ స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సందిగా కోరినట్టు తమ వర్గాలు వెల్లడించాయి.
వారి విచారణ ఎప్పుడంటే..?
సెప్టెంబర్ 22 ఉతప్ప, సెప్టెంబర్ 23 యువరాజ్ హాజరు కానున్నారు. అయితే ఇటీవలే సురేష్ రైనా, శిఖర్ ధావన్, యువరాజ్ లను ప్రశ్నించిన తరువాత ఈ కేసులో సమన్లు పొందిన నాలుగో క్రికెటర్ గా ఉతప్ప చేరాడు. అయితే ఉతప్ప ఇప్పటికే ఒకసారి జూన్ లో హాజరయ్యాడు. మళ్లీ సెప్టెంబర్ 23న హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం విశేషం. మరోవైపు 1xBet గత 18 సంవత్సరాలుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎక్కువగా స్పోర్ట్స్ ఈవెంట్ల పై బెట్టింగ్ వేస్తే.. భారీగా గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది. దాదాపు 70 భాషల్లో ఈ యాప్ ఉండటం గమనార్హం. యువరాజ్ సింగ్, ఉతప్ప తో పాటు సోనూ సూద్ కి కూడా నోటీసులు జారీ చేయడంతో ఇంత మంచి వారు ఇలా వ్యవహరిస్తారా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.