Mohan Babu :గత ఏడాది నుండి మోహన్ బాబు (Mohan Babu)కు వరుస ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) కారణంగా పోలీస్ స్టేషన్, కోర్టు అంటూ ఇన్ని రోజులు తీరికలేకుండా విసిగిపోయిన ఈయన.. ఇప్పుడు మళ్లీ తన విద్యాసంస్థల కారణంగానే ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు మోహన్ బాబు కి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. 2019లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం గురించి ఆందోళన చేపట్టారని, కేసు విచారణ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే రెండవ తేదీన విచారణాధికారి ముందు కచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించలేదని మోహన్ బాబు ఆవేదన..
అసలు విషయంలోకి వెళ్తే.. 2014 నుంచి 2019 వరకు ఏపీ ప్రభుత్వం నుంచి తమ సంస్థ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించలేదని, తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై నటుడు మోహన్ బాబు ఆయన కుమారులు మంచు విష్ణు (Manchu Vishnu) మంచు మనోజ్ విద్యార్థులతో కలిసి బైఠాయించి, ఆందోళన చేసిన విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంగించారని, ధర్నాకు ముందస్తుగా పోలీసులు నుంచి అనుమతి తీసుకోలేదనే కారణంతో పలు సెక్షన్ల కింద ఆయనపై చంద్రగిరి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల తమ సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని, ఆఖరికి ఆస్తులు కూడా తాకట్టు పెట్టామని మోహన్ బాబు అన్నారు.
విచారణకు రావాల్సిందేనని చెప్పిన కోర్ట్..
ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించబడేదని, కానీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, అప్పటి ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు మోహన్ బాబు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాలేజీ నిర్వహిస్తున్న మోహన్ బాబు 75 సంవత్సరాల వ్యక్తి అని, ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తించదని మోహన్ బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తాము చేసిన ధర్నా ఎన్.సీ.సీ పరిధిలోకి రాదని , చార్జిషీటులో ఎన్.సీ.సీ ఉల్లంఘన కేసు తనపై మోపారు. ఈ కేసులోనే ఇరువైపుల వాదనలు విన్న కోర్టు మోహన్ బాబు శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. మరి రేపు విచారణకు మోహన్ బాబు వెళ్తారా ? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.