Liquor Record : ఉప ఎన్నిక వేళ మునుగోడు నియోజకవర్గం మద్యం మత్తులో జోగుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలు మందు, మాంసంనే నమ్ముకున్నాయి. దావత్ ల పేరుతో ఓటర్లకు తాగినంత పోస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచీ మునుగోడులో మందు విందుతో మస్త్ మజా.
దసరాకి ఇంటికో క్వార్టర్ బాటిల్, కిలో మటన్ ప్యాకెట్ ఇచ్చారనేది ఓపెన్ సీక్రెట్. పండగనే కాదు ప్రతీరోజూ పార్టీలే. ఆత్మీయ సమావేశాల పేరుతో మందు పార్టీలు ఇస్తున్నారు. స్వయంగా మంత్రి మల్లారెడ్డినే ఓ సిట్టింగ్ లో పాల్గొని.. గ్లాసులో మందు పోస్తున్న ఫోటోలు ఇటీవల తెగ వైరల్ అయ్యాయి. అట్టుంది మునుగోడులో పరిస్థితి.
గడిచిన నెల రోజుల వ్యవధిలో మునుగోడులో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయని లెక్కలు చెబుతున్నాయి. మూడు ఫుల్ లు, నాలుగు ఆఫ్ లు, ఆరు క్వార్టర్లుగా.. లిక్కర్ దందా జోరుగా సాగుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు.. అన్నిపార్టీలు లిక్కర్ పాలిటిక్స్ నే నమ్ముకున్నాయి. ఓటర్లను మద్యం మత్తులో ముంచుతున్నాయి. మునుగోడు నియోజకవర్గం ఏడు మండలాల్లోని 28 వైన్ షాపుల్లో ఈ నెల అమ్మకాలు సుమారు 200 కోట్లకు చేరాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్న మాట. పోలింగ్ నాటికి సేల్స్.. మరో వంద కోట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. మునుగోడుతో పాటు నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న మండలాల్లోనూ లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. ఎంతలా అంటే మునుగోడులో బీర్లు దొరకనంత.
మందుకు పోటీగా మటన్, చికెన్ సేల్స్ సైతం చెలరేగిపోతున్నాయి. రెగ్యులర్ గా దావత్ లు.. సిప్పుసిప్పుకు మాంసం ముక్కలతో మజారే మజా నడుస్తోంది. నియోజకవర్గం వ్యాప్తంగా చికెన్, మటన్ షాపులకు ఫుల్ గిరాకీ. టన్నులకు టన్నులు నాన్ వెజ్ అమ్ముడవుతోంది. అందుకు తగ్గట్టు రేటు కూడా పెంచేశారు మాంసం వ్యాపారులు. వైన్స్, మటన్, చికెన్ షాప్స్ కు బల్క్ లో ఆర్డర్లు ఇస్తున్నారు నేతలు. మరికొందరైతే నేతలు, పార్టీల పేరు వాడేసుకుంటూ సరుకు తీసుకెళ్లిపోతున్నారు. మొత్తానికి ఉప ఎన్నిక పేరు మీద.. వందల కోట్ల బిజినెస్ జరుగుతుండటంతో అంతా పండగ చేసుకుంటున్నారు.