Hyderabad Book Fair : మూడు దశాబ్దాలుగా పుస్తక ప్రియుల్ని ఆకట్టుకుంటున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. నగరంలోని తెలంగాణ కళా భారత్ (ఎన్టీఆర్) స్టేడియంలో పదిరోజుల పాటు నిర్వహించనున్న ఈ పుస్తక ప్రదర్శనపై ఇప్పటికే.. వేలాది మంది పుస్తకాభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వీరితో పాటు పుస్తక ప్రచురణ సంస్థలు, రచయితలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుస్తక ప్రదర్శన ప్రారంభం కావడంతో.. ఇష్టమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. భాగ్యనగరంలో డిసెంబర్ చివర్లో జరిగే జాతీయ పుస్తక ప్రదర్శనకు.. నేషనల్ లెవల్ లో మంచి గుర్తింపు ఉంది. ఏటా ఇక్కడ నిర్వహించే పుస్తక ప్రదర్శనలో 300 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటు మరెన్నో విశేషాలకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురించి.. కొన్ని విషయాలు తెలుసుకుందాం…
హైదరాబాద్ లోని తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29 వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్(హెచ్‌బీఎఫ్) నిర్వహించనున్నారు. దీనిని బుక్ ఫెయిర్‌లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు కానున్నాయి. వీటిలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు వారి పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ఈ ప్రదర్శన ద్వారా అన్ని భాషల్లోని క్లాసిక్ పుస్తకాలతో పాటు ఇటీవల విడుదలై మంచి గుర్తింపు సాధించిన పుస్తకాలు సైతం అందుబాటులో ఉంటాయి. దాంతో.. దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలున్న రచయితలతో పాటు కొత్తగా రచనలు ప్రారంభించిన రచయితల పుస్తకాలను ఒకేచోట లభిస్తుండడంతో పుస్తకాభిమానలకు ఇదో చక్కని వేదికలా ఉపయోగపడుతోంది.
పదిరోజుల పాటు నిర్వహించనున్న ఈ పుస్తక ప్రదర్శనలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అలాగే.. ప్రదర్శన జరుగుతున్న ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు పేరును పెట్టగా… సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాదిక్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.
జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న ఈ పుస్తక ప్రదర్శన నిర్వహణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కోటేలతో సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బుక్ ఫెయిర్‌లో కేవలం పుస్తకాలే కాకుండా.. తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేసారు. ఇష్టమైన పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు ఇష్టమైన రుచుల్ని సైతం ఆస్వాధించవచ్చు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు బుక్ ఫెయిర్ నిర్వహకులు వివరించారు. పుస్తక ప్రదర్శనకు రావాలనుకునే సందర్శకులు, పుస్తక ప్రియులు.. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియానికి రావాల్సి ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.