6 Minute Wedding: పెళ్లి వేడుక అంటే బంధువుల హడావుడి, అదిరిపోయే డెకరేషన్, భారీ విందు, ఇలా అన్నీ కలగలిపి పెళ్లి వేడుకలు జరగడం కామన్. కానీ ఈ పెళ్లి మాత్రం పూర్తి భిన్నం. కేవలం వధూవరులు మాత్రమే వచ్చారు. నిమిషాల్లో పెళ్లి తంతు ముగిసింది.
తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి వేడుకల పరంపరలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తన కుమారుడి వివాహ వేడుకను కేవలం 6 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహం సామాజిక వ్యవస్థలో పెళ్లి సంస్కృతిపై ఒక కొత్త దృక్పథాన్ని తీసుకువచ్చింది. సంప్రదాయాల బదులు, భారీ ఖర్చులు లేకుండా నిరాడంబరంగా, సాదాసీదాగా ఈ పెళ్లి వేడుక జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సంప్రదాయ పెళ్లి వేడుకలు..
భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది పెద్ద పండుగ. వేద మంత్రాల పఠనం, హల్ది, ముంగి, వివిధ పూజలు, ఆభరణాలు, పెద్ద విందులు, సంగీతం వంటి అనేక సంప్రదాయ రీతులు ఈ వేడుకలో ఉండటం సాధారణం. పెళ్లి వేడుకలు కేవలం కుటుంబ స్టేటస్ గా పరిగణింపబడుతుంది. పెళ్లి ఆడంబరాలు చూసి, వారి హోదాను గౌరవించే రోజులు ఇవి. కానీ ఈ భారీ ఖర్చులతో కూడిన పెళ్లిళ్లు కుటుంబాలపై ఆర్థిక భారం పెంచుతుందని చెప్పవచ్చు. అప్పులు, మోసాలు, ఆర్థిక ఇబ్బందులు పెళ్లిళ్లు తర్వాత తరచూ కనిపిస్తున్న సమస్యలు. అందుకే సమాజంలో నిరాడంబర, సాదాసీదా పెళ్లిళ్లపై ఆసక్తి పెరుగుతోంది.
6 నిమిషాల్లో జరిగిన ఆదర్శ వివాహం
మహబూబాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తన కుమారుడి వివాహాన్ని పిఎస్సార్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ వివాహ వేడుకలో సాధారణ సంప్రదాయాలన్నీ వదిలివేసి, వేద మంత్రాలు, పెద్ద పండుగలు, భారీ విందులు లేకుండా కేవలం 6 నిమిషాల్లోనే వివాహ వేడుక పూర్తి చేశారు. వివాహ ప్రమాణ పత్రం మీద పెద్ద మనుషుల సమక్షంలో సంతకాలు చేసి, నిరాడంబరంగా, త్వరితగతిన వివాహం ముగించారు. పెళ్లి సంబరాలు, బంగారు ఆభరణాలు, కట్న కానుకలు, పసుపు తాడు వంటి సంప్రదాయ అంశాలు అంతా ఈ వేడుకలో లేకపోవడం ప్రత్యేకం.
సమాజానికి సంకేతం..
ఈ వేడుక ద్వారా పెళ్లిళ్లపై ఉన్న అనవసర భారాలు తగ్గించుకోవచ్చని, పెద్ద అద్భుతాలు లేకుండానే సాదాసీదాగా పెళ్లిళ్లు జరగగలవని స్ఫూర్తి కల్పించింది. సామాజికంగా కొత్తదనం, ఆడంబరాలు లేని పెళ్లికి సూచనగా ఈ వివాహం మారిందని అందరూ అంటున్నారు.
Also Read: Tirupati Bus Terminal: శ్రీవారి ఆలయ రూపంలో తిరుపతి బస్ టెర్మినల్ .. దేశంలోనే అద్భుతం!
ఈపెళ్లి తతంగం చూసిన స్థానికులు, సామాజిక నాయకులు, విశ్లేషకులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరితగతిన పెళ్లి కార్యక్రమం, మించిన ఆర్ధిక భారం లేకపోవడం సమాజానికి ఒక కొత్త దిశగా మారిందని అంటున్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని చోట్ల జరగడం ద్వారా, పెళ్లి సంస్కృతి మరింత సాదాసీదా, ఆర్థికంగా అనుకూలంగా మారుతుందని కొందరు అంటున్న పరిస్థితి.