Tirupati Bus Terminal: తిరుపతి ఒక నగరమే కాదు, భక్తుల నగరి. ఇక్కడ తిరుమల పవిత్ర క్షేత్రం ఉండడంతో, తిరుపతి నగరానికి రోజూ ఎందరో భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనార్థం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజూ లక్షల సంఖ్యలో ఉంటుంది. అందుకే తిరుపతి నగరానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు తిరుపతికి రావాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత గల తిరుపతి నగరంలో సరికొత్త నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
పూర్తి వివరాలలోకి వెళితే..
తిరుపతి నగరంలో దేశంలోనే అతిపెద్ద, ఆధునిక సదుపాయాలతో కూడిన ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ (IMBT) నిర్మాణానికి శంకుస్థాపన కాబోతుంది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.500 కోట్లు. ఇది కేవలం బస్ స్టేషన్ అనుకుంటే పొరపాటే. తిరుమల ఆలయ శిల్పకళతో మేళవిన, ప్రయాణికులకు ఆధ్యాత్మికతతో కూడిన అనుభూతిని అందించే కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.
ఎన్ని ఎకరాలలో..
ఈ ప్రాజెక్టును తిరుపతి నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టేషన్ ప్రాంగణంలోనే అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 13 ఎకరాల భూమిపై ఈ టెర్మినల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది ప్రస్తుత సెంట్రల్ బస్ స్టేషన్‌ను పూర్తిగా మార్చి, ఆధునీకరించనున్నారు.
నిర్మాణ ప్రత్యేకతలు
ఈ టెర్మినల్ నిర్మాణ బాధ్యతను నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML), నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంయుక్తంగా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొదట 15 అంతస్తుల నిర్మాణంగా ప్రణాళిక వేసినా, మున్సిపల్ అభ్యంతరాల కారణంగా 11 అంతస్తులకే పరిమితం చేశారు. ఇందులో 98 బస్ ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి. ప్రతి రోజూ సుమారు 2 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఈ టెర్మినల్ ద్వారా ప్రయాణించే అవకాశం ఉంది.
ఆలయ శైలిలో గోపురాలు
ఈ బస్ స్టేషన్ రూపకల్పన పూర్తిగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అనుసరించి ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ద్వారం ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. ప్రయాణికులు అడుగు పెట్టిన వెంటనే వారిని ఆధ్యాత్మికత వాతావరణం వైపు పయనించేలా రూపుదిద్దుకోనుంది. ఈ బస్ టెర్మినల్ నిర్మాణం జరిగితే, తిరుపతి నగర ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పినట్లే.
ఆధునిక సౌకర్యాలు
ఈ టెర్మినల్‌లో ప్రయాణికుల కోసం అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్మాణం సాగనుంది. హెలిప్యాడ్, లగ్జరీ హోటల్స్, ఫుడ్ కోర్ట్‌లు, షాపింగ్ ఏరియాలు
కార్లు, బైక్‌లకు విస్తృత పార్కింగ్, ప్యాసింజర్ లౌంజ్‌లు, వైద్య సహాయ కేంద్రం, ATMలు, EV ఛార్జింగ్ స్టేషన్లు, శిశువుల సంరక్షణ గదుల సౌకర్యం ఇక్కడ ఉండనుంది. ఇది కేవలం బస్సుల కోసం మాత్రమే కాదు, రైలు ప్రయాణికులకు, విమాన ప్రయాణికులకు కూడా అనుసంధానం కల్పించేలా రూపొందించారు.
మెట్రో, రైల్వే, రోప్‌వే కనెక్షన్
ఈ బస్ టెర్మినల్‌ను తిరుపతి రైల్వే స్టేషన్‌తో కలిపేందుకు స్కైవాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారు. రోప్‌వే ద్వారా తిరుమల కొండకు వెళ్లే భక్తులకు ప్రత్యామ్నాయ సౌలభ్యం కల్పించనున్నారు. దీంతో తిరుపతి నగర ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. స్థానిక వ్యాపారవేత్తలకు, చిన్న-చిన్న వ్యాపారులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
Also Read: Tirumala Hidden Secrets: తిరుమల శ్రీవారి గిరుల్లో 66 కోట్ల తీర్థాలు? అసలు రహస్యం ఇదే!
భవిష్యత్ నగర అభివృద్ధికి ఇది మూలస్థంభంగా నిలుస్తుందని చెప్పవచ్చు. తిరుపతి నగరానికి సరికొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దేశంలోనే ఆదర్శంగా నిలవనుంది. రూ.500 కోట్లతో నిర్మితమయ్యే ఈ ఆలయ శైలిలో బస్ టెర్మినల్, తిరుపతిని కొత్త అభివృద్ధి దిశగా నడిపిస్తుందని నగరవాసులు అంటున్నారు.