
Hyderabad News(Telangana Updates) : హైదరాబాద్‌లోని సనత్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. నరబలి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని అల్లాదున్ కోటిలో నివసించే రెడీమేడ్ దుస్తుల వ్యాపారి వసీం ఖాన్ కుమారుడిని ఫిజా ఖాన్ అనే హిజ్రా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫిజా ఖాన్ వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడని, డబ్బుల చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య గురువారం వాగ్వాదం జరిగింది.
గురువారం సాయంత్రం వసీం ఖాన్ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో అపహరించి.. ఫిజా ఖాన్ ఇంటి వైపునకు వెళ్లారు. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీం ఖాన్ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్లాస్టిక్ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. తొలుత బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. బకెట్‌ను ప్లాస్టిక్ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో వేసినట్లు తెలుస్తోంది. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకొచ్చారు.
బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.