Jagtial News: అదొక పాఠశాల. ఎందరో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే సరస్వతీ నిలయం. అటువంటి పాఠశాల వద్ద కనిపించని వస్తువులంటూ కొన్ని ఉంటాయి. కేవలం చిత్తు పేపర్లు మాత్రమే కనిపించాల్సిన పాఠశాల ప్రాంగణంలో కొత్తగా కొన్ని వస్తువులు కనిపించాయి. ఇదేంటిది అంటే.. నో కామెంట్స్ అంటూ ఉపాధ్యాయులు, సిబ్బంది బదులివ్వడం విశేషం. ఈ ఘటన జగిత్యాల లోని సీఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల లోని సీఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద పలువురు విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అసలే రేపు జనవరి 26 వస్తోంది. తమ పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని ఆ చిన్నారులు చీపురు పట్టి ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పాఠశాల పరిసరాలను శుభ్రం చేస్తున్న క్రమంలో విద్యార్థుల కంట కనిపించకూడని కొన్ని వస్తువులు కనిపించాయి. దీనితో విద్యార్థులు వాటిని కూడ అలాగే ఊడుస్తూ.. శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే వైపుగా వెళ్తున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అంతలోనే విద్యార్థుల కంటపడకూడని వస్తువులు వారికి కనిపించాయి. అవేనండీ నిరోధ్ లు, వాటి ప్యాకెట్ లు మీడియా కంటపడ్డాయి. వాటి గురించి ఆరా తీస్తే, రోజూ ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయని అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు విద్యను అభ్యసించే పాఠశాల వద్ద ఇదేమి చోద్యం అంటూ అక్కడికి వచ్చిన స్థానికులు కూడ నివ్వెర పోయారట.
Also Read: Republic Day Wishes: రిపబ్లిక్ డే సందర్భంగా మీకోసం మంచి కొటేషన్లు.. ఇదిగో చూడండి..
సరస్వతీ నిలయమైన పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని, వెంటనే పాఠశాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే నిరోధ్ ప్యాకెట్ లు కనిపించడంపై సదరు ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే.. వ్యవస్థ అలా తయారైందని నిట్టూర్చారు. అంటే ఉపాధ్యాయుడికి తెలిసి కూడ ఏమి చేయలేణి స్థితిలో ఉన్నారా అనే ప్రశ్న కూడ వినిపిస్తోంది. విద్యాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి దుస్థితి అంటూ పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.