BRS: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఎందుకు భయపడింది? లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే కమలనాధులతో ఏమైనా డీల్ జరిగిందా? ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయించుకుంది? పరువు కాపాడుకునేందుకు ఈ ప్లాన్ చేసిందా? పాతికేళ్ల చరిత్ర ఉన్న కారు పార్టీ వెనుదిరగడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కారు పార్టీ అధినేత, మాజీ కేసీఆర్ టెన్షన్ నుంచి భయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాతికేళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే కారు వెనుకడుగు వేస్తుందనే చెప్పాలి.
త్వరలో తాము అధికారంలోకి వస్తామని పదేపదే మీడియా ముందు రీసౌండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాము బలంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో ఏమైనా డీల్ కుదుర్చుకుందా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓ మున్సిపాలిటీ తప్ప దాదాపుగా అన్నింటికీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లలో అదే దూకుడు కొనసాగించింది. పోటీ చేయని విపక్ష టీడీపీ, సొంతంగా పోటీ చేస్తున్నవారికి మద్దతు ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో అదొక సేఫ్ గేమ్. ఇప్పుడు సైకిల్ దారిలో కారు పార్టీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
ALSO READ: కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం మల్లగుల్లాలు.. వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములా
తెలంగాణలో ఓ పట్టభద్రుడు, రెండు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సోమవారం (ఫిబ్రవరి మూడు) నుంచి మొదలయ్యాయి. అయితే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కదలిక రాలేదు. తొలుత పలువురు నేతల పేర్లు పరిశీలనకు వచ్చినా, ఒక వేళ ఓడిపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని భావించారట కేసీఆర్.
మొన్న జరిగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్‌రెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్, ఈసారి అలాంటి తప్పిదాలు చేయకూడదన్నది ఆ పార్టీ ఆలోచనగా కొందరు నేతలు చెబుతున్నారు.
పార్టీ తరపున ఎవరినీ పోటీకి దింపవద్దని, అలాగే మద్దతు ఇవ్వవద్దని నేతలకు సంకేతాలు ఇచ్చారట కేసీఆర్. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైంది కారు పార్టీ. ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ కావద్దన్నది కేసీఆర్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.
ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపు బీజేపీతో డీల్ కుదిరిందని అంటున్నారు. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోని మరో వర్గం మాట. బీఆర్ఎస్ లేని లోటును పూడ్చుకోవడానికి బీజేపీకి ఇదే సరైన సమయం. కాకపోతే ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కమలాన్ని కలవరపెడుతున్నాయి. బీఆర్ఎస్ ఇచ్చిన అవకాశాన్ని కమలం అందుకుంటుందా? అన్నది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.