Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా నుంచి వర్షాలు దంచికొట్టాయి. కుండపోత వానలు కురిశాయి. రుతపవనాలు చురుగ్గా కదలడం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన పరిస్థితుల వల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోయింది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల అష్టకష్టాలు చూశారు. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీ వరద నీరు చేరింది.
ఈ జిల్లాల్లో వర్షాలు..
తాజాగా భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీ వర్షాలు మాత్రం ఉండవని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్ట్ 3 వరకు రాష్ట్ర్రంలో ఎలాంటి భారీ వర్ష హెచ్చరికలు లేవని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కాస్త పొడిగా ఉంటుందని వివరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఆగస్టు 2 వారంలో భారీ వర్షాలు..
హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు రెండవ వారం (ఆగస్టు 9-12 తర్వాత) నుండి హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండవచ్చని చెప్పారు. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని వివరించారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి..
ప్రస్తుతం, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నల్గొండ జిల్లాలో 34.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో 33.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు తగ్గి, కొన్ని ప్రాంతాల్లో వరదలు, ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ముఖ్యంగా భాగ్యనగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: Integral Coach Factory: టెన్త్ క్లాస్‌తో 1010 ఉద్యోగాలు, స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. పూర్తి వివరాలివే
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశయాల నీటి మట్టాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల ఈ జలాశయాలు దాదాపు నిండుకున్నాయి. రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. వాతావరణ శాఖ సూచనలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.