BigTV English

BRS: భారంగా ‘బీఆర్ఎస్’ బ‌కాయిలు.. పదేళ్లలో పేరుకుపోయిన కోట్ల రూపాయలు

BRS: భారంగా ‘బీఆర్ఎస్’ బ‌కాయిలు.. పదేళ్లలో పేరుకుపోయిన కోట్ల రూపాయలు

– పదేళ్లలో పేరుకుపోయిన కోట్ల రూపాయలు
– ఆరోగ్య శ్రీ నిధుల విడుదలలో అలసత్వం
– సుమారు 730 కోట్లు చెల్లించని నాటి సర్కార్
– అధికారంలోకి రాగానే క్లియ‌ర్ చేసిన కాంగ్రెస్‌
– ఏడాదిలో ఆరోగ్య‌శ్రీ‌కి 1130 కోట్ల చెల్లింపులు
– బీఆర్ఎస్ హ‌యాంలో నోరుమెదపని ఆస్ప‌త్రులు
– ఇప్పుడు ఆందోళనలు చేస్తామని హడావుడి
– సీఈవోతో చర్చల తర్వాత రూ.120 కోట్లు జమ
– ఆందోళ‌న విర‌మిస్తామ‌ని.. అంత‌లోనే యూట‌ర్న్‌
– బీఆరెఎస్ గుప్పిట్లో యాజమాన్యాలు?


తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ:
బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్య శ్రీలో బకాయిలు.. నేడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెత్తిన భారంగా ప‌రిణ‌మిస్తున్నాయి. ఏ ఏడాదిలోనూ పూర్తి స్థాయిలో నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ‌కి నిధులు విడుద‌ల చేసింది లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ఏడాదిలోనే 1130 కోట్ల‌ను చెల్లించిన‌ట్టు ప్ర‌భుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే.. బ‌కాయిల కోసం ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేసే క్ర‌మంలో స‌మ్మె నోటీసు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వం 120 కోట్లు విడుద‌ల చేసింది. కానీ.. మ‌ళ్లీ స‌మ్మె కొన‌సాగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆరోగ్యశ్రీ స్కీమ్ కోసం 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేసింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్‌‌ నుంచి 2024 డిసెంబర్ వరకు నెలకు సగటున రూ.76 కోట్లను ఖర్చు చేసింది. అంతేగాక పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా మరో రూ.487.29 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం కేటాయించారు. ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి వ‌చ్చే 1835 వైద్య చికిత్సల ధరలను సుమారు 20 శాతం వరకు పెంచింది. కేవలం ఆరోగ్య శ్రీ ట్రీట్‌మెంట్ కోసం ఏడాదిలోనే దాదాపు 1130 కోట్లను నెట్‌వ‌ర్క్‌ ఆస్పత్రులకు చెల్లించినట్లు వైద్యారోగ్యశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.


గత ప్రభుత్వం గడిచిన పదేళ్ల నుంచి పెండింగ్‌లో పెడుతూ వచ్చిన రూ.730 కోట్ల బకాయిలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్లియర్ చేసింది. దీంతో, ఈ ఏడాది నిధులు రిలీజ్ చేసినా.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు డ్యూస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాము ఈ నెల 10 నుంచి సమ్మె చేయనున్నట్లు నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఓ ప్రకటన విడుదల చేశాయి.

స్పాట్‌లో 120 కోట్ల విడుద‌ల‌
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ సీఈవో వెంటనే ప్రైవేట్, కార్పొరేట్ అసోసియేషన్లతో ప్రత్యేకంగా చ‌ర్చించి, సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అంతేగాక స్పాట్‌లో రూ.120 కోట్లు రిలీజ్ చేశారు. మిగతావి ఫిబ్రవరిలో అడ్జెస్ట్ చేస్తామని చెప్పగా, టీ‌ఏ‌ఎన్‌హెచ్ గురువారం అంగీకరించింది. దీంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మె విరవిస్తున్నట్లు ప్రభుత్వం నోట్ రిలీజ్ చేసింది. కానీ కొద్ది గంటల్లోనే నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.

ఆరోగ్య శ్రీ , ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ పథకాలకు 12 నెలల నుంచి నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, దీని వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం మరో ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన కమిట్‌మెంట్‌లో తమకు న్యాయం జరగటం లేదని, దాదాపు రూ.1100 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ రిలీజ్ చేస్తేనే సమ్మె విరమిస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. అంతేగాక కొన్ని జిల్లాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల ముందు ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా చికిత్సలు నిర్వహించడం లేదని ఏకంగా బోర్డులు కూడా పెట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు స్ట్రైక్ కొనసాగుతుందని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది.

10 ఏళ్లు 50 శాతం చొప్పున రిలీజ్?
ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఏటా సగటున వెయ్యి కోట్లకు చొప్పున నిధులు వెచ్చించాల్సి ఉండగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు 50 శాతం చొప్పున కేటాయిస్తూ వ‌చ్చింది. 2015లో రూ.444 కోట్లు, 2016 లో రూ.609 కోట్లు, 2017లో రూ.524 కోట్లు, 2018లో రూ.596కోట్లు, 2020లో రూ.557 కోట్లు, 2021‌లో రూ.783కోట్లు, 2022లో రూ.631 కోట్లు, 2023లో రూ.515 కోట్లు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో రూ.1130 కోట్లను విడుద‌ల‌ చేసింది. అయితే సగం సగం చొప్పున నిధులు రిలీజ్ చేస్తున్నా.. గతంలో నెట్‌వర్క్ హాస్పిటల్స్ పూర్తిస్థాయిలో గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయాయని స్వయంగా అధికారులే చెబుతున్నారు.

కొన్నిసార్లు మొక్కుబడిగా సమ్మె నోటీసులు ఇచ్చి, చర్చల్లో రాజీకి వ‌చ్చార‌ని గుర్తు చేస్తున్నారు. కానీ ప్రైవేట్, నెట్‌వర్క్ ఆస్పత్రుల పెండింగ్ డిమాండ్లలో కీలకమైనవి కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించినా, బడ్జెట్‌ను విడుదల చేస్తున్నా.. సమ్మె నోటీసులు ఇస్తుండ‌టంపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులు బీఆర్‌ఎస్ ట్రాప్‌లో ఉన్నాయని, అందుకే డబ్బులు జమ అయిన తర్వాత కూడా స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నారని పేరు రాయ‌డానికి నిరాక‌రించిన ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు తర్వాత రివర్స్ గేర్ వేశాయని, దీని వలన పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేషెంట్లకు నిత్యం సతాయింపులే..?
ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్‌లోని కొన్ని హాస్పిటల్స్ నిత్యం పేద పేషెంట్లను సతాయిస్తూనే ఉన్న‌ట్టు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. బకాయిలు పేరిట పేషెంట్లను రిజెక్ట్ చేయడం, గతంలో ప్యాకేజీ ధరలు తక్కువగా ఉన్నాయని వేరే ఆస్పత్రులకు రిఫర్ చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. కార్డులున్నా.. బిల్లులు వసూలు చేసిన ఆస్పత్రులూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆయా ఆస్పత్రులకూ పెండింగ్ నిధులు వచ్చాయి.

పేషెంట్లను ఇబ్బంది పెట్టినా, ప్రభుత్వం నుంచి ఎంప్యానెల్ ఆస్పత్రులకు సపోర్టు చేస్తూనే ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ పేషెంట్లను ఇబ్బంది పెట్టడం సరికాదని వైద్యాధికారులు వివరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో ఆరోగ్య భద్రతకు చిక్కులు ఏర్పడ్డాయి. పందేడ్లు అధికారంలో ఉన్న స‌మ‌యంలో నిధులన్నీ డైవర్ట్ చేస్తూ కమీషన్లు వచ్చే స్కీమ్‌లకు పెట్టారని, అందుకే ఈ సమస్య ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.

ఆరోగ్య భద్రత స్కీమ్‌పై దాదాపు రూ.273 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ఉద్యోగుల అడ్మిషన్లలోనూ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమస్యలు సృష్టిస్తున్నాయి. తమకు బిల్లులు రావడం లేదని ఆయా ఆస్పత్రులు పేషెంట్లను రిజెక్ట్ చేయడం లేదా, ప్రాసెస్ డీలే చేయడం వంటివి జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×