ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ముత్యం వెంకటరమణపై ఏసీబీ అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయాన్నే మొదలైన ఈ దాడి విద్యుత్ శాఖ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పక్కా వ్యూహంతో ఈ సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల కోసం ఏసీబీ ఏకంగా 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు, ఆయన బంధువులకు చెందిన 14 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన హైటెక్ సిటీ, ‘మీనాక్షి స్కై లాంజ్’లోని ఆయన నివాసంలో సోదాలు ముమ్మరంగా సాగాయి. అధికారం, హోదాను అడ్డుపెట్టుకుని సంపాదించిన ఆస్తుల పుట్టను కదిలించేందుకు అధికారులు అంగుళం అంగుళం జల్లెడ పట్టారు.
అధికారుల సోదాల్లో దొరికిన ప్రాథమిక ఆధారాలు ఏసీబీ వర్గాలను సైతం విస్తుపోయేలా చేశాయి. సోదాల సందర్భంగా భారీగా ఆస్తి పత్రాలు, స్థిర-చర ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, భారీ లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న లాకర్లను, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ కీలకమైన కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సాధారణ అధికారుల కంటే భిన్నంగా నివాసాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్‌ను మెయింటెన్ చేస్తున్న వెంకటరమణ అసలు ఆస్తుల విలువ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పత్రాలను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సోదాలు పూర్తిగా పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు, బినామీ ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ మెరుపు దాడితో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Also Read: కరీంనగర్‌లో తుపాకీ గురిపెట్టి రూ.21 లక్షలు, 66 తులాల గోల్డ్ మాయం.. అసలు ఏం జరిగింది?