Addanki Dayakar: కాంగ్రెస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సిఎల్పీ మీడియా హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ముందుగా తన ఆస్తుల వివరాలను బయటపెడితే, కాంగ్రెస్ నాయకులు కూడా తమ ఆస్తులను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు.
కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలి
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తన ఆస్తులను ధైర్యంగా ప్రకటించారు. కేటీఆర్‌కు నిజాయితీ ఉంటే రేపటిలోగా తన ఆస్తులను బహిర్గతం చేయాలి. 60 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తికి ఉండటానికి ఇల్లు లేదనడం హాస్యాస్పదం. తెలంగాణలో అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే, చిన్న కొడుకు కేటీఆర్. కేసీఆర్ కు పుట్టడం వల్లే కేటీఆర్ నాయకుడయ్యాడు తప్ప, సొంత ప్రతిభతో కాదు’ అని విమర్శించారు.
అక్రమ ఆస్తుల వ్యాపారం
కేటీఆర్ తన అధికార దుర్వినియోగంతో దక్కన్ సెలెక్ట్, హెట్ హోమ్ హోటల్ వంటి ఆస్తులను సంపాదించారని దయాకర్ ఆరోపించారు. జన్వాడలో ఈడీ ఎటాచ్ చేసిన భూముల్లో కేటీఆర్ భార్య పేరిట 4 ఎకరాలు, అత్తగారి పేరిట 18 గుంటల భూమి ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. గత పదేళ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకోవడంలో నిజాం రాజులను కూడా మించిపోయిందని మండిపడ్డారు.
పేదలకు భూముల పంపిణీ
బిఆర్ఎస్ నాయకుల నుంచి బయటపడే అక్రమ భూములను తెలంగాణ ఉద్యమకారులకు, పేదలకు పంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘మా భూములు మాకివ్వాలి’ అని పోరాడిన అమరగాయకుడు గద్దర్ తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారందరికీ ప్రజా క్షేత్రంలో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
Also Read: తీర్పు వచ్చేవరకూ ఆగాల్సిందే.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం!