Addanki Dayakar: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుల తీరుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సొంత కుటుంబ సభ్యురాలైన కవిత అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దివాళాకోరు స్థితిలో వారిద్దరూ ఉన్నారని విమర్శించారు. కవిత అన్నట్లుగానే హరీష్ రావు అసలైన గుంటనక్క అని మండిపడ్డారు.
వారసత్వ రాజకీయంపై ధ్వజమెత్తు
నాయకత్వ లక్షణాలు లేకపోయినా కేసీఆర్ కొడుకుగా పుట్టడమే అర్హతగా కేటీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇన్నాళ్లూ భరించాల్సి వచ్చిందని దయాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వారసత్వం తీసేస్తే కేటీఆర్‌కు అసలు రాజకీయ ఉనికి లేదన్నారు. ఎమ్మెల్యేలకే నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వడాన్ని తప్పుపడుతూ కేటీఆర్ నియంతృత్వ ధోరణితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకోవడానికి కేసీఆర్ స్వేచ్ఛనిచ్చారని, చివరికి గిరిజన ఎమ్మెల్యేలు అడుక్కున్నా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.
ఉద్యమకారులకు ద్రోహం..
తెలంగాణ కోసం కొట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, మందకృష్ణ మాదిగ వంటి నిజమైన ఉద్యమకారులను జైళ్లకు పంపి, ఉద్యమంతో సంబంధం లేని ఆంధ్రా, మహారాష్ట్ర వ్యక్తులతో కలిసి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లు, బిజినెస్‌లు నడిపారని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని వేల కోట్లు కట్టబెట్టారని విమర్శించారు.
సుద్దపూసల్లా మాట్లాడితే నమ్మరు
తెలంగాణను సర్వనాశనం చేసినందుకే బీఆర్ఎస్‌కు ఈ పాపం తగిలిందని, వారిని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని దయాకర్ స్పష్టం చేశారు. డబ్బులిచ్చి పాటలు పెట్టించుకునే ప్రచార ఆర్భాటాలు మాని నిజాయతీగా పనిచేయాలని, నీతులు చెప్పేముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
Also Read: శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!