Chamala Kiran: గాంధీభవన్‌లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా శైలితో పోలుస్తూ కేటీఆర్ రాజకీయాన్ని, ఆయన తీరును ఎండగట్టారు.
చీమల పుట్టలో పాము కేటీఆర్!
శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు అమెరికా నుంచి వచ్చి ఊరిలో బస చేసినట్లే, కేటీఆర్ కూడా 2009లో ఉన్నపళంగా సిరిసిల్లలో అడుగుపెట్టారని ఎంపీ విమర్శించారు. కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో అంతా సిద్ధం చేసుకున్నాక, కేటీఆర్ వచ్చి ఆయన్ను పక్కనబెట్టి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఇది చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరడం లాంటిదేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ కుట్రల చిట్టా
2023లో ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఐదేళ్లపాటు ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడం, రైతులను తప్పుదోవ పట్టించడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చూడటం, ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కొంగరకలాన్ ప్రాంతంలో భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొడుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేటీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
సిరిసిల్ల అభివృద్ధి, నేతన్నల పరిస్థితి
కేటీఆర్ హయాంలో కట్టిన కలెక్టరేట్ కార్యాలయం చిన్న వర్షానికే మునిగిపోయిందని, లోపలికి వెళ్లడానికి ట్రాక్టర్ వాడాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను సూరత్ వ్యాపారులకు ఇచ్చి, స్థానిక నేతన్నలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పోతూ పోతూ చేనేత కార్మికులకు 300 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారని, ఆయన మాటలు నమ్మి సిరిసిల్ల ప్రజలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్‌కు సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని, ఆయన కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని చామల పేర్కొన్నారు. సీఎం స్థాయి వేరు, కేటీఆర్ స్థాయి వేరన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అంతటినీ త్వరలోనే బయటపెడతామని, సిరిసిల్లలో కేటీఆర్ చేసిన తప్పులను ప్రజల ముందే నిలదీసి అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు.
Also Read: కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!