Excise Weapons: స్వేచ్చ బ్యూరో: ఎక్సైజ్ సిబ్బంది చేతికి త్వరలోనే ఆయుధాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించడానికి సమగ్ర సమాచారాన్ని తీసుకోవడానికి క్యూర్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ సమీక్ష జరిపారు. ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వడానికి అనుమతి ఇస్తే ఏ స్థాయి అధికారులకు వెపన్లు ఇవ్వాలని అన్న దానిపై అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం వెపన్లు ఇస్తే పోలీస్ శాఖతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
విధుల్లో ఉన్న సమయంలో కొన్నిసార్లు సిబ్బంది గంజాయి స్మగ్లర్లు, డ్రగ్స్ రవాణాదారుల దాడులకు గురవుతున్న విషయం తెలిసిందే. దీనికి నిదర్శనంగా నిజామాబాద్ శివార్లలో జరిగిన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. గత జనవరి 23న నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా గంజాయితో వస్తున్న కారును ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు ఆపకుండా వేగంగా కారును నడుపుతూ కానిస్టేబుల్ సౌమ్యను తీవ్రంగా ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ సమయంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిబ్బందికి ఆయుధాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. తాజాగా ఇదే అంశంపై ఎక్సైజ్ కమిషనర్ సమావేశం నిర్వహించటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!
డ్రగ్స్, ఎన్‌డీపీఎస్ (నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్)పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి, అరికట్టడడానికి చర్యలు చేపట్టాలని కమిషనర్ అదేశించారు. బార్లు, మద్యం షాపులకు సంబంధించిన ఎక్సైజ్ రెంటల్ ఫీజ్‌ను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. కొత్త బార్ల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అవసరమైన సౌకర్యాల కల్పన చేపట్టాలని, దరఖాస్తుదారులకు ఎక్సైజ్ అధికారులు తగిన గైడెన్స్ ఇవ్వాలని కమిషనర్ అదేశించారు. సమావేశంలో అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్ రావు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ డిప్యూటి కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, హరికిషన్, టీజీబీసీఎల్ డిప్యూటి కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ శీలం శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్లు డి.శ్రీనివాస్, జి.శ్రీనివాసరెడ్డి, కె.ప్రదీప్‌రావుతోపాటు ఈఎస్‌లు పాల్గొన్నారు.
Also read: హైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా ఎఫ్‌డిఏ దృష్టి.. పురుగుమందు అవశేషాలపై హెచ్చరిక