Diwali Special Trains: దీపావళి, ఛత్ పండుగలు వచ్చాయంటే చాలు.. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతాయి. సొంతూళ్లకు వెళ్లేవారు, పండుగల తర్వాత తిరిగి వచ్చేవారితో రైళ్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 18,000 ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు, కీలక స్టేషన్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది.
పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచింది. దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో మొత్తం 18,000 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సాధారణ రైళ్లపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా ఈ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అంతేకాదు, రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో అదనంగా RPF సిబ్బందిని కూడా తీసుకొస్తున్నారు. ప్రయాణికుల భద్రత, క్యూల మెయింటెనెన్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీ మరింత ఎక్కువగా ఉంది. సాధారణ రోజుల్లో ఈ స్టేషన్‌కు రోజుకు ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పండుగలు, సెలవుల సమయంలో ఈ సంఖ్య ఏకంగా ఎనిమిది లక్షలకు చేరుకుంటుంది. ఈ స్థాయిలో ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడం రైల్వే అధికారులకు పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే స్టేషన్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు.
ప్రయాణికుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 700కు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్టేషన్‌లో ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంది? ప్రయాణికులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా గుమిగూడుతున్నారు? లాంటి విషయాలను మానిటర్ చేయనున్నారు. అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకునేలా జాగ్రత్త పడుతున్నారు.
రైల్వే స్టేషన్లలో రద్దీకి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లపై గుమిగూడటం. దీనిని నివారించేందుకు ఈసారి న్యూఢిల్లీ స్టేషన్‌లో రిజర్వేషన్ ఉన్నవారికి, జనరల్ టికెట్‌తో ప్రయాణించేవారికి వేర్వేరుగా వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. పండుగల సమయంలో రద్దీ అధికంగా ఉండే ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వేమంత్రి తెలిపారు. ప్రత్యేక రైళ్లు, అదనపు భద్రతా సిబ్బంది, ఏఐ కెమెరాలు, ప్రత్యేక వెయిటింగ్ ఏరియాలతో ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Read Also: బెంగళూరు-గోవా వందే భారత్ వెరీ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!