Army Helicopter Crash : జమ్ముకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో సిరిసిల్ల జిల్లాకు చెందిన టెక్నిషియన్ పబ్బల్ల అనిల్ మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపంతో కిశ్త్ వాడ్ జిల్లా అటవీప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన సిరిసిల్ల వాసి అనిల్ మృతి చెందాడు. మరువా నదితీరాన హెలికాప్టర్ శకలాలు గుర్తించారు.
ఆర్మీ జవాన్ అనిల్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ ఆర్మీలో పదేళ్లుగా టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం అనిల్ సెలవులు ముగించుకొని తిరిగి విధుల్లోకి చేరారు. ప్రమాద ఘటనపై అర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ధ్రువ్ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురికావడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి.
అనిల్ మృతితో మల్కాపూర్ లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్ కు బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్, ఆరవ్ ఉన్నారు. నెల రోజుల క్రితం అనిల్ స్వగ్రామానికి వచ్చారు. కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. కోరెంలో జరిగిన బీరప్ప ఉత్సవాలకు హాజరయ్యారు. 10 రోజుల క్రితమే తిరిగి విధులకు వెళ్లారు. ఇంతలోనే హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి అనిల్ మృతదేహం స్వగ్రామానికి తరలించే అవకాశం ఉంది.