Venu Swamy: తెలంగాణ మహిళా కమిషన్ కు ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి ఎట్టకేలకు క్షమాపణ కోరారు. ఎన్నో కీలకమలుపుల తర్వాత వేణుస్వామి సారీ చెప్పారని చెప్పవచ్చు. ఓ దశలో మహిళా కమిషన్ సీరియస్ కావడం, అలాగే వేణు స్వామి కూడ హైకోర్టు మెట్లెక్కడం అందరికీ తెల్సిన విషయమే. ఈ అంకానికి సారీ చెప్పి వేణుస్వామి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పవచ్చు.
అసలేం జరిగిందంటే..
ప్రముఖ జ్యోతిష్కులు పరాంకుశం వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలుస్తారు. అలా ఆయన చెప్పిన జ్యోతిష్యం పలుమార్లు వివాదాలకు దారి తీసింది. అలా నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం సమయంలో వేణుస్వామి సంచలన జోష్యం చెప్పారు. అక్కడ నిశ్చితార్థం జరుగుతుండగానే, వేణుస్వామి చెప్పిన జాతకం సంచలనంగా మారింది. అది కూడ నాగచైతన్య, శోభితలు ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పారు వేణు స్వామి. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకోవడం ఖాయమని తేల్చి చెప్పారు. అసలే సమంతతో విడిపోయి నాగ చైతన్య శుభమా అంటూ శోభితతో వివాహం జరుపుకోవాలని నిర్ణయించిన క్రమంలో ఇదేమి జోస్యం అంటూ అందరూ వేణుస్వామిపై మండిపడ్డారు.
వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా వేణు స్వామిపై ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వేణు స్వామి కి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మహిళా కమిషన్ ముందు వేణుస్వామి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనితో వేణు స్వామి మంగళవారం మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు. కమిషన్ ముందు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు క్షమించమని కోరారు. సారీ చెప్పిన వేణుస్వామికి కమిషన్ కూడ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని ఉమెన్ కమిషన్ హెచ్చరించగా వేణుస్వామి, ఆ మేరకు హామీఇచ్చి వెనుతిరిగారు. మొత్తం మీద నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం వేళ వేణుస్వామి చేసిన కామెంట్స్ వివాదంకు, వారి వివాహం అనంతరం ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.
👉క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
👉నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామి నేడు తెలంగా మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద ఎదుట విచారణకు హాజరయ్యారు. 👉తాను ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని.. క్షమాపణలు చెబుతూ లేఖ అందించారు. pic.twitter.com/Zoomwiw2xX— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2025