Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: భారత్ సమ్మిట్ పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమ్మిట్ మధ్యలోనే వెళ్లిపోయారని, దేశ ప్రజలే కాకుండా విదేశాలు సైతం కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, అంతేకానీ విదేశాల ముందు దేశ ప్రతిష్ఠను దిగజార్చడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు.
చెప్పుచేతల్లో పెట్టుకోవడమే రాహుల్ ప్రజాస్వామ్యమా?
తెలంగాణ గడ్డ దేశభక్తులకు, పోరాట యోధులకు వేదిక అని పేర్కొన్న బండి సంజయ్.. భారత్ వ్యతిరేక శక్తులతో కలిసి రాష్ట్ర పవిత్రతను అపవిత్రం చేశారని ఆరోపించారు. భారత్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒకే కుటుంబం దశాబ్దాలపాటు దేశాన్ని పాలించడం ప్రజాస్వామ్యమా? ఒకే కుటుంబం పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడమే రాహుల్ మార్క్ ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఫాసిజం కనిపించలేదా?
ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ హక్కులను కాలరాసిన కాంగ్రెస్ పాలనలో ఫాసిజం కనిపించలేదా? 3 వేల మంది సిక్కులను ఊచకోత కోసినప్పుడు ఫాసిజం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ వద్ద ఆధారాలుంటే అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి ఎందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భారత్ సమ్మిట్‌లో కౌలు రైతుల స్టాల్ ఏర్పాటు చేయడాన్ని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మూడేళ్లుగా ఎందుకు అమలు చేయలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. భారత్ సమ్మిట్ పేరుతో అంతర్జాతీయ వేదికపై దేశ అంతర్గత రాజకీయ అంశాలను ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ వైఖరిని బయటపెట్టుకుందని బండి సంజయ్ విమర్శించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read: ఇంటిపై రెండు నిమిషాల పాటు డ్రోన్ కలకలం.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్నలు!