Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరీంనగర్ అభివృద్ధి, రాజకీయ సమీకరణలు , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. లోపాయికారీ ఒప్పందాలతో నడుస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. కేవలం మాటలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక లోపలేస్తాం అన్న రేవంత్ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని.. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పని చేయడం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని.. అప్పుడు కేంద్రం తన పవర్ చూపిస్తుందని సవాల్ విసిరారు.
కరీంనగర్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌కు రూ. 1400 కోట్లు ఇచ్చామని చెప్పడం ఒక పెద్ద జోక్ అని కొట్టిపారేశారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డ్ కోసం ఇప్పటికే రూ. 50 కోట్లు వచ్చి ఉన్నాయని గుర్తు చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4-5 సీట్ల కంటే ఎక్కువ రావని.. అక్కడ గెలిచే పరిస్థితులే లేవని జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలతోనే కొంపముంచుతున్నారని.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తుతం జనాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని.. ప్రజలు వారిని నిలదీస్తున్నారని పేర్కొన్నారు. తనను కేంద్ర మంత్రులు మెచ్చుకుంటుంటే.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేత ఓవైసీని రేవంత్ రెడ్డికి అన్నగా అభివర్ణిస్తూ.. ఈ ఇద్దరూ కలిసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: మేడారం జాతర హుండీల లెక్కింపు షురూ.. వామ్మో తొలిరోజే ఇంత ఆదాయమా!