CM Progress Report: ఈవారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కుంగిన మేడిగడ్డ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం, అసైన్డ్ భూ సమస్యలపై ఫోకస్ పెట్టడం, తెలంగాణ నెంబర్ వన్ లక్ష్యంగా అడుగులు, రియల్ ఎస్టేట్ కు ఊతం ఇచ్చేలా భరోసా, ప్రభుత్వాఫీసులన్నిటిపై సోలార్ సెటప్స్ కోసం చర్యలు ఇలాంటి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.
10-08-2025 ఆదివారం ( వరదకు శాశ్వత పరిష్కారం )
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 10న ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బల్కంపేట వంటి ప్రాంతాల్లో వరద ముంపు ప్రభావిత కాలనీలను సీఎం పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు సూచనలు చేశారు. బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంగూబాయి బస్తీకుంట దగ్గరికి వెళ్లి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమీర్ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడిని తన వెంట తీసుకుని ఆ ప్రాంతాల్లో కలియతిరిగారు.
11-08-2025 సోమవారం ( ఫుడ్, టూరిజం స్టార్టప్ లకు బూస్టప్ )
రాష్ట్రంలో ఫుడ్, టూరిజం స్టార్టప్ లకు బూస్టప్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఆవిష్కరించింది. ఆగస్టు ఫెస్ట్ కార్యక్రమంలో తెలంగాణ కలినరీ అండ్ ఎక్స్ పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ ను పర్యాటక శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐసీ సీఈవోతో కలిసి ఇటీవలే ఆవిష్కరించారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, నైస్‌ఆర్గ్, కలినరీ లాంజ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో పాతుకుపోయిన వ్యాపారాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించేందుకు దోహదపడుతుందన్నారు. స్టార్టప్ లకు నిపుణుల మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్, నైస్‌ఆర్గ్ ఇన్వెస్టర్ నెట్ వర్క్ ద్వారా ఫండ్ రైజింగ్ సపోర్ట్ లభించనుంది. తెలంగాణ ఆహార, పర్యాటక అనుభవాలను ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు.
12-08-2025 మంగళవారం ( దేవాలయాల అభివృద్ధి )
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ ఈనెల 12న అధికారులతో సమీక్షించారు. కొడంగల్‌లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ ఆమోదించారు. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండప డిజైన్లలను అధికారులు సీఎంకు వివరించారు. అలాగే, దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నారు.
12-08-2025 మంగళవారం ( మనకూ ఓ ఎకో టూరిజం.. )
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మనకు భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు.. అందులోనే నదులు, జలపాతాలు ఉండడంతో ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈనెల 12న అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం సమీక్షించారు. మన దగ్గర అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళ్తున్నారని, అందుకే మన దగ్గరే సౌకర్యాలు పెంచేలా చూడాలన్నారు. వరంగల్‌లో జూ ను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై స్టడీ చేయాలన్నారు. అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేయాలన్నారు.
13-08-2025 బుధవారం ( భూములకు భూధార్ నెంబర్లు )
ఈనెల 13న సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూశాఖపై సుదీర్ఘంగా రివ్యూ చేశారు. ఇందులో అధికారులకు కీలక అప్డేట్స్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన తర్వాత రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. అటు కోర్ అర్బన్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నమూనాలను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, ఆఫీసులు పూర్తిగా ప్రజలకు స్నేహ పూర్వక వాతావరణంలో, సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించగా, ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.
VO: 12-08-2025 మంగళవారం ( దేవాలయాల అభివృద్ధి )
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ ఈనెల 12న అధికారులతో సమీక్షించారు. కొడంగల్‌లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ ఆమోదించారు. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండప డిజైన్లలను అధికారులు సీఎంకు వివరించారు. అలాగే, దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నారు.
14-08-2025 గురువారం ( ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ ప్లాంట్లు )
గ్రామ పంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రభుత్వ భవనాలు, ROFR భూముల్లో ఇందిరా పౌర గిరిజన వికాస పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి ఇటీవలే కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచే పంపిస్తామన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లపై కలెక్టర్లు పంపాల్సిన వివరాలతో ఒక ప్రశ్నావళిని పంపించారు. వారంలో వివరాలు నమోదు చేసి పంపాలన్నారు. ప్రభుత్వ భవనాలతోపాటు ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపైనా సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో ప్రారంభించబోతోంది సర్కారు.
15-08-2025 శుక్రవారం ( తెలంగాణ నెంబర్ వన్ లక్ష్యం )
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టే వరకు, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించేవరకు విశ్రమించేది లేదని ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటుందని, తమకు సంకల్పం ఉందని, అందుకు అవసరమైన విజన్ ఉందన్నారు సీఎం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు తగ్గట్లుగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని, రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామన్నారు. అలాగే సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశామన్నారు.
15-08-2025 శుక్రవారం ( రియల్ ఎస్టేట్ కు ఊతం )
అపోహలు, అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా నెగెటివిటీ వచ్చేలా బయట ప్రచారాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ దేశమంతా ఒకే మూడ్ తో ఉంది. అయితే తెలంగాణలోనే పడిపోయిందన్న ప్రచారాలను ప్రభుత్వం ఖండిస్తోంది. హైడ్రాకు, రియల్ ఎస్టేట్ కు లింక్ పెడుతూ ఇంకొందరు ప్రచారాలు చేశాయి. అయితే ఈ నెగెటివిటీకి సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. ప్రజలకు ఉపయోగపడేలా రియల్ ఎస్టేట్ రంగంలో సరైన ప్రణాళికలతో ముందుకొస్తే తప్పకుండా సహకరిస్తామన్నారు. దాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటానని చెప్పడం ద్వారా తన సంసిద్ధతను సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు ఒడిగట్టే ప్రశ్నే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
16-08-2025 శనివారం ( మేడిగడ్డ రిపేర్లపై అడుగులు )
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కోసం NDSA చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా రిపేర్ల విషయంపై నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడో బ్లాక్ మరమ్మతు కోసం అవసరమైన చర్యలను ప్రారంభించింది. రిపేర్ ఎలా చేయాలో డిజైన్ల తయారీ బాధ్యతలను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌కు ఇప్పటికే ప్రభుత్వం అప్పగించింది కూడా. ఈఎన్సీకి ఆ సంస్థ లేటెస్ట్ గా జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే బాగుంటుందని రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీంతో ఈఎన్సీ తర్వాతి చర్యలపై అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపైనా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. 2023 అక్టోబరు 21న ఏడో బ్లాక్ కుంగింది. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏ సహాయం కోరగా పలు సూచనలు చేసింది. ఆ ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తోంది.
16-08-2025 శనివారం ( అసైన్డ్ భూ సమస్యలపై ఫోకస్ )
ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉంటూ వస్తున్న అసైన్డ్ భూ సమస్యల పరిష్కారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నజర్ పెట్టింది. జిల్లాస్థాయిలో అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంబంధించి, అర్హులైనవారికి యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు కొత్తగా భూముల పంపిణీకి ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అన్యాక్రాంతమైన భూములపైనా అసైన్డ్ కమిటీల నిర్ణయమే కీలకం కాబోతోంది. రెవెన్యూశాఖ రూపొందించిన ఫైల్ సీఎం కార్యాలయానికి చేరింది. అసైన్డ్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో యాజమాన్య హక్కులు లేని రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అసైన్డ్ భూములకు సంబంధించి చాలా చిక్కులు ఎదురవుతున్నాయి. వాటన్నిటికీ మానవీయ కోణంలో పరిష్కరించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఒక రకంగా పేదరైతులకు ఇది సంతోషకరమైన విషయమే.
Story By Vidya Sagar, Bigtv