Big Stories

Bharat Jodo Yatra : భాగ్యనగరంలో భారత్ జోడో యాత్ర జోష్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Bharat Jodo Yatra : కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లో ప్రవేశించింది. శంషాబాద్ నుంచి పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు. ఆరాంఘర్ మీదుగా పురానా పూల్ కు చేరుకున్నారు. ఆ తర్వాత పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ కు యాత్ర సాగుతుంది.

- Advertisement -

శంషాబాద్ నుంచి విద్యార్థులతో ముచ్చటిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగించారు. ఒక విద్యార్థిని ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాన్ని ఆసక్తిగా తిలకించారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటిీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. సాయంత్రం భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కార్నర్ సభ నిర్వహిస్తారు. రాజేంద్రనగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు నగరంలోని 7 నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా స్వాగతం పలకడానికి జెండాలు, ఫ్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాటు చేశాయి. రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు.

- Advertisement -

భారత్‌ జోడో యాత్రలో కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, సదర్‌ విన్యాసాలు, జానపద కళా విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. ప్రతి రెండు కిలో మీటర్లకు ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

ఇక పాదయాత్ర జరిగే మూడు కిలోమీటర్ల రేడియస్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు రోజులపాటు నగరంలో ఈ ఆంక్షలు ఉంటాయి. తొలిరోజు ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెస్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. యాత్ర జరిగే ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అంబులెన్స్ లను మాత్రం అనుమతిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌ కోసం పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్క్ వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News