Central Schemes: కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, కేంద్ర పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించాలని భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణకు కేంద్ర నిధుల ప్రవాహాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై మరింత దృష్టి సారించాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించి, ఆశించిన ఫలితాలు సాధించాలని సూచించారు. తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) కింద రాష్ట్రానికి నిధుల రాకను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసి, ప్రజలకు ఉద్దేశించిన ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం నిధులు సమకూరుస్తున్నందున, నిధుల వినియోగంతో పాటు వాటి ద్వారా సాధించే ఫలితాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న లైజన్ అధికారుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని, పెండింగ్ అంశాలపై సకాలంలో అనుసరణ కొనసాగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రులకు రాసిన లేఖలపై కూడా నిరంతరం సమీక్షిస్తూ, పురోగతిని తెలుసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ వంటి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పథకాల అమలులో ఉన్న సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
సాగునీరు, పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తద్వారా పథకాల కొనసాగింపుతో పాటు అదనపు నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధులను సకాలంలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ సమస్యల్లో చాలా వరకు పరిష్కరించామని, అన్ని బిల్లులను క్రమశిక్షణతో క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర పథకాల పురోగతి, నిధుల వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ డిప్యూటీ సీఎంకు వివరించారు.
Also Read: చనిపోయిన కుక్కకు స్వర్గం నుంచి తిరిగొచ్చే ఛాన్స్… పగ తీర్చుకోవడానికి తిరిగొచ్చి ఏం చేసిందో తెలుసా ?