Tummidihatti Barrage: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెంచింది. బ్యారేజ్ ఎత్తును 148 బదులుగా 152 మీటర్ల కు పెంచాలన్న ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి గత నెల 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చలు జరిపారు . ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నవంబర్ ఒకటిన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బ్యారేజీ నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. అటవీ భూములు, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, నివాస ప్రాంతాల వివరాలతో సమగ్ర మ్యాపులు సిద్ధం చేయాలని సూచించారు.
మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. నిరంతరం సంప్రదింపులు జరపాలని.. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య చేసుకున్న ఒప్పందాలు, ఇతర కీలక పత్రాలను మహారాష్ట్ర అధికారులకు అందించాలని సూచించారు.
ముఖ్యంగా బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం.ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు ,జాయింట్ అకౌంట్‌లో వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూముల ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించినా అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి అధికారులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ అంశంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి శ్రీధర్, ఈఎన్‌సీ రమేష్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఇక డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపైనా సీఎం సమీక్షించారు. డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేటకు 0.1 టీఎంసీల అదనపు నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
Also Read: విశ్వక్ సేన్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్… విజయ్ దేవరకొండ వాయిస్ తో…