Osman Sagar: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే జంటజలాశయాల్లో ఒకటైన గండిపేట (ఉస్మాన్‌సాగర్) కు వందేళ్ల పురాతనమైన రాతి నిర్మాణ కాండ్యూట్‌పై లీకేజీల మరమ్మతు పనులు చురుగ్గా కొనసాగుతున్నట్లు జలమండలి అధికారులు మంగళవారం వెల్లడించారు. సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల్లో ఏర్పడిన లీకేజీలను అరికట్టేందుకు జలమండలి నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 ఎంజీడీల సామర్థ్యం గల కాండ్యూట్‌పై మరమ్మతు పనులను అధికారులు వేగవంతం చేశారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే పనులు పూర్తి చేసి, ప్రభావిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జలమండలి స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. వందేళ్లకు పైగా పురాతనమైన కాండ్యూట్ కావడంతో మరమ్మతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శాశ్వత పరిష్కార పనులకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
నగరానికి వివిధ జలవనరుల నుంచి ప్రతిరోజూ దాదాపు 560 ఎంజీడీల తాగునీరు సరఫరా అవుతుండగా, ప్రస్తుత షట్‌డౌన్ కేవలం గండిపేటకు సంబంధించిన 20 ఎంజీడీల కాండ్యూట్‌కు మాత్రమే పరిమితమని జలమండలి స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి, సింగూరు,మంజీరా తదితర ఇతర జలవనరుల నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జలమండలి తెలిపింది. మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి వెల్లడించింది. అప్పటివరకు వినియోగదారులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కూడా కోరింది.
Also Read: వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!
తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టి నీటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు జలమండలి ప్రవేశపెట్టిన (పానీ) యాప్‌కు ప్రజల నుంచి స్పందన లభిస్తున్నట్లు జలమండలి మంగళవారం వెల్లడించింది. ఇప్పటివరకు 437 మంది స్వచ్ఛందంగా జలమండలి వెబ్‌సైట్ ద్వారా వాటర్ వారియర్లుగా నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి పౌరుడు జలమండలి వెబ్‌సైట్‌లో సేవ్ వాటర్ వాలంటీర్‌గా నమోదు చేసుకోవచ్చనని స్పష్టం చేశారు. నమోదు చేసుకున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పానీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పరిసరాల్లో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని గుర్తించి ఫిర్యాదు చేయవచ్చనని తెలిపారు. ముఖ్యంగా తాగు నీటితో వాహనాలు, ఫ్లోర్లు కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, ఇతర రూపాల్లో నీటిని వృథా చేయడం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చనని తెలిపారు.
వాలంటీర్ల ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి దుర్వినియోగం నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా భరోసా ఇస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. ప్రతి కుటుంబం తమ రోజువారీ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని, నీటి లీకేజీలను అరికట్టడంతో పాటు తాగునీటిని అనవసర అవసరాలకు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ, నివాస సముదాయం నుంచి ఎక్కువ మంది వాటర్ వారియర్లుగా ముందుకు రావాలని జలమండలి కోరింది. ప్రజల భాగస్వామ్యంతోనే నీటి వృథాను సమర్థవంతంగా అరికట్టగలమని, ప్రతి పౌరుడు పానీ యాప్‌ను వినియోగించి నీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చింది.
Also read: అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో