ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నల్లగుంట్ల యాదగిరి రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల అనుమతి అనంతరం మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ హైకోర్టు కాలనీలో 334 చదరపు గజాల స్థలంలో నిర్మించిన జీ+3 పెంట్‌హౌస్ భవనాన్ని గుర్తించారు. రికార్డుల ప్రకారం దీని విలువ సుమారు రూ.2.50 కోట్లుగా అంచనా వేశారు.
ఇంటీరియర్ డెకరేషన్, ఇతర పరికరాల విలువ మరో రూ.20 లక్షలుగా గుర్తించారు. అదేవిధంగా హబ్సిగూడ, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు, హబ్సిగూడలో ప్లాట్లు, పార్కింగ్ స్థలం, మేడిపల్లిలో ఓపెన్ ప్లాట్, గాంధీనగర్‌లో 633 చదరపు గజాల స్థలం, సూర్యాపేటలో సుమారు 580 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను గుర్తించారు. వీటితోపాటు సుమారు రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, రూ.21 లక్షల విలువైన మహీంద్రా థార్ కార్లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, యాక్టివా, ప్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాలను గుర్తించారు. అలాగే 2.5 కిలోల బంగారం, మూడు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చరాస్తుల విలువ ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.4 కోట్లకు పైగా ఉన్నట్లు డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.
అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. పూర్తిస్థాయి తనిఖీలు, విచారణ అనంతరం ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సంబంధిత అధికారి కుమారుడి పెట్టుబడులకు సంబంధించిన రబ్బరు ఫ్యాక్టరీ, ట్రాన్స్‌మిషన్ ఇండస్ట్రీస్‌లోనూ ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంస్థల్లో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై మరింత విచారణ జరపనున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ, వాటి మూలాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. యాదగిరిరావును కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
Also read: కొడుకుకు నచ్చిన బొమ్మను కొనివ్వడానికి సిటీని పీకి పందిరేసే తండ్రి… ఎపిక్ ఎమోషనల్ మూవీ