Heavy Rains In Telangana: సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం రామోజీపల్లిలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి చెందారు. నాగిలిగిద్ద మండలం ముక్తాపూర్‌లో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, మొగుడంపల్లీలో 2.6 సెం.మీ. పాపన్న పేట మండలం లింగాయిపల్లిలో 1.9 సెం. మీ వర్షపాతం నమోదైంది.
ఇక ఇప్పటికే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో ఎన్నికల సామాగ్రి పంపిణీ వద్ద సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షంలోనే ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు సిబ్బంది. దీంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇక ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ పేర్కొంది.
Also Read: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్!
ఇక జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.