Formula E Race Case: మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి నేరం రుజువైతే, అన్ని సంవత్సరాల శిక్ష ఖాయమేనా? తానేమి చేయలేదని కేటీఆర్ గంభీరంగా చెబుతున్నా, ఈ కేసులో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది? అసలు కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇలాంటి అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చారు ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావు. బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పూర్ణచంద్రరావు పలు సంచలన విషయాలను వెల్లడించారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఎక్కడ చూసినా చర్చోప చర్చలు సాగుతున్నాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఏసీబీ విచారణకు పిలవడం, అంతేకాకుండా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంపై ఈ కేసు ప్రత్యేకతను సంతరించుకుంది. తాజాగా ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. మళ్లీ కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏముంది? ఏం జరగబోతుందో ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావు ప్రత్యేకంగా బిగ్ టీవీతో మాట్లాడారు.
పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్బీఐ రూల్స్ పాటించకుండా, ప్రభుత్వ ధనాన్ని బదలాయించినట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే ఏసీబీ కేసు నమోదు చేసిందని, కేటీఆర్ పిటిషన్ ను సైతం హైకోర్టు కొట్టివేసి దర్యాప్తుకు ఆదేశించడంతో కేసు కీలక మలుపు తిరిగిందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పదేపదే కేసులో ఏమీ లేదని, లొట్ట పీసు కేసు అంటూ కొట్టి పారేయడంపై ఆయన స్పందించారు. గవర్నర్ అనుమతి ఇవ్వడం, హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతోనే కేసు పూర్వపరాలు అర్థం చేసుకోవచ్చన్నారు.
రాజకీయ నాయకులు వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, కేసులంటే రాజకీయ నాయకులకు భయం లేకుండా పోయిందన్నారు. రాజకీయ నాయకుల పై నమోదైన కేసులపై త్వరగా దర్యాప్తు చేసి న్యాయస్థానాలు తీర్పు ఇస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని పూర్ణచంద్రరావు తెలిపారు. ఇక ఫార్ములా కార్ రేస్ కేసుకు సంబంధించి అధికారి అరవింద్ కుమార్ హాజరైనట్లే, కేటీఆర్ కూడా హాజరు కావచ్చని, ఒకసారి సమన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు.
తానేమి చేయలేదని ప్రజలకు చెప్పడం, మీడియాకు ప్రచారం చేసుకోవడం వంటి చర్యలు సానుభూతి పొందడం కోసం రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ చేస్తున్నట్లుగా భావించవచ్చని ఆయన తెలిపారు. ఏసీబీ అధికారులు తమకు కావాల్సిన ఆధారాలను దర్యాప్తులో సేకరిస్తారని పూర్ణచంద్రరావు అన్నారు. కేటీఆర్ విచారణకు హాజరు కావడానికి లాయర్ అవసరం ఏముంటుందని, కేటీఆర్ ఉన్నత పదవిలో పనిచేసిన వ్యక్తిగా మీడియా సాక్షిగా విచారణ కోసం లోపలికి వెళ్తారు మళ్ళీ బయటకు వస్తారని ఆయన తెలిపారు. ఏసీబీ అధికారులు కేవలం విచారణ మాత్రమే చేస్తారని, కేటీఆర్ పై నమోదైన నేరం రుజువైతే ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది అంటూ మాజీ డీజీ పూర్ణచంద్రరావు అన్నారు.