Hyderabad Cyber Police: హలో.. మీ అకౌంట్ క్లోజ్ అవుతోంది. మీ సిమ్ కు ఇక ఫోన్లు రావు. త్వరగా ఓటిపి చెప్పండి. ఈ తరహాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరాగాల ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఒకేసారి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులకు, దిమ్మ తిరిగే షాక్ తగిలింది. 23 మంది సైబర్ నేరగాళ్లలో ఒక మహిళ ఉండగా, ఆ మహిళ ఢిల్లీలో ఎన్జీవో ను నిర్వహించడం విశేషం.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సైబర్ నేరాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫిర్యాదులను ఛాలెంజ్ గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత.. ప్రత్యేక టీం ద్వారా సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా నిందితులుగా ఉన్న 23 మందిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్సును అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 23 మంది నేరగాళ్ల ను అరెస్టు చేసిన పోలీసులు, వీరు రూ. 5.29 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. తెలంగాణలో 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, ఈ నేరస్థులపై దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదై ఉండడం విశేషం.
వీరి అరెస్ట్ పై సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మాట్లాడుతూ.. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు గాలించి, నేరగాలను అరెస్టు చేసినట్లు, ఐదు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. అయితే అనుమానాస్పద లావాదేవీల విషయంలో 70 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో మార్పు.. పూర్తి వివరాలివే!
సదరు మహిళ ఢిల్లీలో ఎన్జీవో ను నడుపుతుండగా, డబ్బులకు ఆశపడి సదరు ఎన్జీవో ఖాతాను సైబర్ నేరగాళ్లకు ఆమె అప్పగించడం విశేషం. సైబర్ నారగాళ్లు చోరీ చేసిన నగదును ఆ ఖాతాలో బదిలీ చేయించుకుని నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్జీవో ఖాతాను సైబర్ నేరగాళ్లకు అప్పగించినందుకు సదరు మహిళలు కూడా అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. న్యాయస్థానం ముందు మహిళను హాజరు పరిచిన సమయంలో ఆమె కోసము పది మంది లాయర్లు వాదించారని, డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కోరారు.